Site icon NTV Telugu

అటు చెర్రీ తో శంకర్… ఇటు బన్నీతో మురుగదాస్!

Shankar movie with Ram charan and Murugadoss Movie with Allu Arjun

మెగా ఫ్యామిలీ యంగ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అంతేకాదు.. అవకాశం చిక్కాలే కానీ ఉత్తరాదిన పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్ హిందీ చిత్రం ‘జంజీర్’లో నటించాడు కానీ తనదైన మార్క్ వేసుకోలేకపోయాడు. దాంతో మెగా ఫ్యామిలీలోని మరో యంగ్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆచితూచి ఉత్తరాది వైపు అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఇదిలా ఉంటే రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి రామ్ చరణ్‌ ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో ఇటు అల్లు అర్జున్ సైతం సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న ‘పుష్ప’తో అలాంటి గుర్తింపునే పొందబోతున్నాడు. ఇది రెండు భాగాలుగా వస్తుండటం మరో విశేషం. ఇదిలా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత తన రేంజ్ తగ్గకుండా చూసుకోవాలని రామ్ చరణ్ ఏకంగా క్రేజీ డైరెక్టర్ శంకర్ తోనే చేతులు కలిపాడు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే… ఈ సినిమా నిర్మాత ‘దిల్’ రాజు ఈ పాటికే సెట్స్ పైకి తీసుకెళ్ళే వాడు. కాస్త అటు ఇటు అయినా… త్వరలో ఈ మూవీ పట్టాలెక్కడమైతే ఖాయం. అదే సమయంలో అల్లు అర్జున్ సైతం ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ చేయబోతున్నాడు. దీని తర్వాత కూడా మరో పాన్ ఇండియా మూవీకి బన్నీ ఇప్పటి నుండే పథక రచన చేస్తున్నాడని తెలుస్తోంది.

Read Also : ముందు సీతావతారం… తరువాత ద్రౌపదిగా దీపిక!

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మురుగదాస్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడట. దానికి సంబంధించిన వర్క్ సైతం సైలెంట్ గా జరుగుతోందని అంటున్నారు. ఇటీవలే అల్లు అరవింద్, అర్జున్ కు మురుగదాస్ స్క్రిప్ట్ వినిపించాడన్నది తాజా సమాచారం. ఒక్కసారి ఈ తండ్రీ కొడుకుల నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే… మురుగదాస్ ఆ ప్రాజెక్ట్ పనిలో పడిపోతాడని అంటున్నారు. విశేషం ఏమంటే… అల్లు అరవింద్, మురుగదాస్ మధ్య అనుబంధం ఈవాల్టిది కాదు. గతంలో తమిళ ‘గజిని’ సినిమాను అల్లు అరవింద్ తెలుగులో డబ్ చేయడంతో పాటు, హిందీలోనూ రీమేక్ చేశారు. ఆ అనుబంధంతోనే అర్జున్ హీరోగా అల్లు అరవింద్ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తాడని, దీనికి ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ధాను సైతం సహ నిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఇటు చెర్రీ, అటు బన్నీ వరుస పాన్ ఇండియా మూవీస్ వెనుక ఒకరితో ఒకరు పోటీ పడుతున్న దాఖలాలూ కనిపిస్తున్నాయని కొందరంటున్నారు. మెగా ఫ్యామిలీలోని ఈ ఇద్దరు న్యూ జనరేషన్ స్టార్ హీరోల మధ్య కనిపించని పోటీ ఒకటి నెలకొందని, అందుకనే ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే ఇలా పోటాపోటీగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Exit mobile version