Shanarthi : కరీంనగర్ జిల్లాలో ‘శనార్తి’ రెగ్యులర్ షూటింగ్ మొదలు

Shanarthi

Shanarthi

టాలీవుడ్‌లో పక్కా లోకల్, రా అండ్ రస్టిక్ కథలకు ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్ ఉంది. ‘ఓదెల’ ఫ్రాంచైజీతో పల్లెటూరి నేపథ్య కథలను బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలచడంలో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ప్రముఖ దర్శకుడు, సంపత్ నంది.. ఇప్పుడు మరో అదిరిపోయే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ‘రాజ్ వెడ్స్ రాంబాయ్’ ఫేమ్ అఖిల్ రాజ్, నెటిజన్లను ఉర్రూతలూగించే ‘ఫోక్ క్వీన్’ నాగదుర్గలను ఏకంగా వెండితెరకు హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ దెబ్బకు ట్రెండ్ మార్చేశారు. వీరు జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘శనార్తి’ రెగ్యులర్ షూటింగ్ కరీంనగర్ జిల్లాలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆదిత్య మూవీస్ సమర్పణలో, సంపత్ నంది టీమ్ వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్లపై కే.వి. శ్రీధర్ రెడ్డి, సంపత్ నంది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వెలిచాలలో డైరెక్టర్ సంపత్ నంది, ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న గణేష్ రాజ్ ఉప్పునూటి స్వస్థలం కూడా కరీంనగర్ జిల్లాలోని గట్టు బూత్కూర్ కావడం.
ఒక యువ దర్శకుడు తన తొలి సినిమాను తన సొంత ఊరి వాతావరణంలోనే (వెలిచాల, గట్టు బూత్కూర్) సుమారు నెల రోజుల పాటు చిత్రీకరిస్తుండటం విశేషం. దర్శకుడికి అక్కడి నేటివిటీపై ఉన్న పూర్తి పట్టు ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ కానుంది. తెలంగాణ సంప్రదాయాలు, మట్టి వాసనను, సాంస్కృతిక మూలాల్ని వెండితెరపైకి బలంగా తీసుకురాబోతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. పల్లెటూరి పాటలకు, ఎమోషనల్ సీన్స్‌కు తన సంగీతంతో ప్రాణం పోసే సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటం సినిమా రేంజ్‌ను పెంచుతోంది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్షన్ పల్లెటూరి అందాలను కళ్లకు కట్టనున్నాయి. మై విలేజ్ షో రాజు, మురళీధర్ గౌడ్, సునందిని, సుంకర లక్ష్మి, రమేష్ నకిరికంటి, వైవా రెడ్డి, అంజి బాబు వంటి పక్కా లోకల్ టాలెంట్ ఉన్న నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూట్యూబ్ స్టార్స్‌ను సిల్వర్ స్క్రీన్‌పైకి తీసుకొస్తూ సంపత్ నంది వేసిన ఈ మాస్టర్ స్కెచ్ ‘శనార్తి’ టాలీవుడ్‌లో ఓ సరికొత్త మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి నాగదుర్గ ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే అయినా, ఆమె నటిస్తున్న వేరే సినిమాలు ఒకటి రెండు రిలీజ్ అవ్వగా మరికొన్ని రిలీజ్ కి సిద్దం అయ్యాయి.