తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ, హిందీ చిత్రాలలో నటించి అలరించిన నాటి అందాలతార జయంతి ఈ రోజు (జూలై 26) ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ళ క్రితమే జయంతి మరణించిందన్న వార్త విశేషంగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఆమె కోలుకున్నారు. జయంతి నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్ ను వివాహమాడిన జయంతి, కొన్నేళ్ళకే విడిపోయారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు. మాతృభాష తెలుగుఅయినా, కన్నడ చిత్రసీమలో విశేషాదరణ చూరగొన్నారు జయంతి. మొదట్లో మద్రాసులోనే ఉన్న జయంతి తరువాత బెంగళూరకు మకాం మార్చారు.
జయంతి అసలు పేరు కమల కుమారి. 1945 జనవరి 6న ఆమె జన్మించారు. సంయుక్త మదరాసు రాష్ట్రంలోని బళ్ళారి ఆమె జన్మస్థలం. ఇప్పటికీ బళ్ళారిలో తెలుగువారి ఆధిక్యం కనిపిస్తుంది. అప్పట్లో తెలుగువారిదే పైచేయిగా ఉండేది. అందువల్ల జయంతికి మాతృభాషలోనే మంచిపట్టు ఉండేది. తరువాత మద్రాసు చేరారు. ఆమె తల్లి సంతాన లక్ష్మికి, జయంతిని క్లాసికల్ డాన్సర్ ను చేయాలన్న అభిలాష ఉండేది. దాంతో కొంతకాలం నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. అక్కడ ఆమెకు ప్రఖ్యాత హాస్యతార మనోరమ సహ విద్యార్థిని.
యన్టీఆర్ అభిమానిగా…
జయంతి బళ్ళారిలో ఉండగానే, అక్కడ యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన పాతాళభైరవి చిత్రం ప్రభాత్ టాకీస్ లోదాదాపు 200 రోజులు ప్రదర్శితమయింది. ఆ సమయంలో తరచూ ఆ చిత్రాన్ని చూసిన జయంతి, యన్టీఆర్ ను ఎంతగానో ఆరాధించేవారు. మద్రాస్ చేరిన తరువాత స్నేహితురాలు మనోరమతో కలసి యన్టీఆర్ ను చూడాలన్న అభిలాషతో స్టూడియోస్ కు వెళ్ళేది. చిన్నపిల్లలు కాబట్టి లోపలకు అనుమతించేవారు. యన్టీఆర్ చిరంజీవులు చిత్రంలో గుడ్డివాడుగా నటిస్తూ ఉండడం చూసి బోరున విలపించింది జయంతి. అది చూసిన యన్టీఆర్ ఆమెను ఓదార్చి తన చెంతనే కూర్చోబెట్టుకొని ఇదంతా కేవలం నటన, నువ్వు కూడా నటించవచ్చు. నాతో కలసి నటిస్తావా? అంటూ ఓదార్చారు. ఆ చిత్రంలో పేకేటి శివరామ్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఆయన కూడా జయంతిని అనునయించి పంపారు. తరువాత జయంతిలో అందం, చందం ఉన్నాయి కాబట్టి ఆమె నటి కావచ్చునని జయంతి తల్లికి పేకేటి సూచన ఇచ్చారు. అలా కొన్ని తమిళ చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించారు జయంతి. తరువాత కేవీ రెడ్డి జగదేకవీరుని కథ తెరకెక్కిస్తున్న సమయంలో కథానాయకుని సరసన నలుగురు నాయికలలో ఒకరిగా జయంతిని ఎంచుకున్నారు. అప్పటికీ ఆమెపేరు కమల కుమారిగానే ఉండింది. అదే సమయంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు ఏయన్నార్ హీరోగా భార్యాభర్తలు నిర్మిస్తున్నారు. అందులోనూ జయంతిని ఓ కీలక పాత్రకు ఎంపిక చేసుకున్నారు. నిజానికి ఆమెకు ప్రాధాన్యమున్న పాత్ర లభించిన తొలి చిత్రం జగదేకవీరుని కథ అయినా, ముందుగా విడుదలయిన చిత్రం భార్యాభర్తలు. ఈ రెండు చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. ఇక జయంతి జన్మస్థలం బళ్ళారిలో జగదేకవీరుని కథ శతదినోత్సవం చేసుకుంది. దాంతో కన్నడిగుల మనసునూ ఆమె దోచుకుంది. వై.ఆర్.స్వామి అనే కన్నడ దర్శకనిర్మాత, జయంతిని తన జేను గూడు చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమకు పరిచయంచేశారు. ఆ సినిమా మంచి ఆదరణ పొందింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తో కలసి తొలిసారి చందవళ్ళియ తోటలో నటించారు జయంతి. ఆ సినిమా తరువాత దాదాపు 30 కన్నడ చిత్రాలలో రాజ్ కుమార్ కు జోడీగా అలరించారామె. మాతృభాష తెలుగులో కన్నా మిన్నగా కన్నడ చిత్రసీమలో ఆమెకు ఆదరణ లభించింది. అయినప్పటికీ తనదరికి చేరిన తెలుగు చిత్రాలలోనూ ఆమె నటిస్తూ వచ్చారు.
మరపురాని మధురానుభూతి
తన అభిమాన నటుడు యన్టీఆర్ ను చూస్తే చాలు అనుకున్న జయంతి, ఆయన సరసనే నాయికగా పరిచయం కావడం విశేషం. తనలో జన్మలో మర్చిపోలేని మధురానుభూతి అని జయంతి తరచూ చెప్పేవారు. పేకేటి శివరామ్ ను వివాహమాడిన తరువాత తొలుత యన్టీఆర్ ఆశీస్సులే తీసుకున్నాననీ ఆమె తెలిపారు. కన్నడలో పేకేటి శివరామ్ దర్శకత్వంలోనే రాజ్ కుమార్ త్రిపాత్రాభినయం చేసిన కులగౌరవ చిత్రాన్ని తెలుగులో యన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన కులగౌరవంగా తెరకెక్కించారు. ఇందులో రామారావు సరసన జయంతి నాయికగా నటించారు. తరువాత చాలా ఏళ్ళ తరువాత కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలలో జయంతి యన్టీఆర్ తో జోడీ కట్టారు. ఆ రెండు చిత్రాల అపూర్వ విజయం తరువాత తెలుగునాట మళ్ళీ జయంతి బిజీ అయిపోయారు. తరువాతి తరం హీరోల చిత్రాలలో వదిన, తల్లి,అక్క పాత్రల్లో అభినయించి అలరించారు.
నలుగురు సూపర్ స్టార్స్ తో…
తమిళనాట కూడా జయంతికి మంచి ఆదరణ లభించింది. జెమినీగణేశన్ తో ఎక్కువ చిత్రాలలో నాయికగా నటించారామె. యమ్.జి.రామచంద్రన్, జై శంకర్, ముత్తురామన్ వంటి వారి సరసన కూడా హీరోయిన్ గా అలరించారు. మళయాళంలో ప్రేమనజీర్ తోనూ కొన్ని సినిమాల్లో అభినయించారు. నాటి సౌత్ సూపర్ స్టార్స్ యన్టీఆర్, ఎమ్జీఆర్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ తో కలసి నటించడం తన అదృష్టం అని జయంతి చెబుతూ ఉండేవారు. కృష్ణ త్రిపాత్రిభినయం చేసిన తొలి చిత్రం కుమార రాజాలో ఆయన సరసన నాయికగా నటించారు జయంతి. శోభన్ బాబుతో ఆమె నటించిన జీవితం, శారద వంటి సినిమాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. జీవితం, శారద చిత్రాల సమయంలో నటి శారదతో ఆమెకు స్నేహం ఏర్పడింది. ఆ తరువాతి రోజుల్లోనూ వారిద్దరూ అనేక సినిమాల్లో నటించారు. యన్టీఆర్ సరసన వీరిద్దరూ జస్టిస్ చౌదరిలో నటించారు. తరువాత అనేక చిత్రాలలో ఇద్దరూ కేరెక్టర్ రోల్స్ లో కనిపించారు. వామ్మో వాత్తో ఓ పెళ్ళామాలోనూ వీరు కీలక పాత్రలు పోషించారు. ఆ సమయంలోనే జయంతి, శారద తమ స్నేహబంధం గురించి విశేషంగా ముచ్చటించారు. యన్టీఆర్ తొలి త్రిపాత్రాభినయం కులగౌరవంలోనూ, కృష్ణ తొలి త్రిపాత్రాభినయం కుమార రాజాలోనూ, రాజ్ కుమార్ త్రిపాత్రాభినయం కులగౌరవలోనూ నటించడం మరపురాని మధురానుభూతిగా ఆమె అభివర్ణించేవారు.
జయంతి తన కంటే పెద్దవారితోనూ, చిన్నవారితోనూ నాయికగా నటించి అలరించారు. నవతరం నాయకులకు బామ్మగానూ మెప్పించారు. కన్నడ నాట నాయికగా ఆమె జైత్రయాత్ర సాగించారు. రాజ్ కుమార్, ఉదయ్ కుమార్, కళ్యాణ్ కుమార్, అశ్వథ్ వంటి స్టార్స్ తో నటించి మెప్పించారు. శ్రీనాథ్, లోకేశ్ వంటి వారి సినిమాల్లోనూ నాయికగా అలరించారు. కొన్ని చిత్రాలలో శృంగారం కూడా ఒలకబోసి జనాన్ని కిర్రెక్కించారు. అందుకే కన్నడ సీమలో ఆమె అందానికి సలామ్ చేసిన అభిమానులు ఈ నాటికీ జయంతిని ఆరాధిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా దక్షిణాది సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో జయంతి తనకంటూ కొ్న్ని పేజీలను దక్కించుకున్న తారగా నిలచిపోయారు.