పులివెందుల యూట్యూబర్ మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “స్కూల్ లైఫ్”. నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న భారతదేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ చిత్రంలో పులివెందుల మహేష్ సరసన సావిత్రి, షన్ను నటించగా, సీనియర్ నటులు సుమన్, ఆమని, మరియు మురళి గౌడ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పులివెందుల మహేష్ మాట్లాడుతూ, “మా ‘స్కూల్ లైఫ్’ చిత్రం కేవలం నా ఒక్కడి కల కాదు, మా టీమ్ సభ్యులందరి సమష్టి కృషి. పూర్తిస్థాయి రాయలసీమ నేటివిటీకి పెద్దపీట వేస్తూ, స్కూల్ నేపథ్యంలో సాగే ఒక చక్కటి ప్రేమ కథ, స్నేహం యొక్క గొప్పతనం, రైతుల కష్టాలు మరియు పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలను జోడించి పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల విడుదలైన మా టీజర్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, ఇది మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.”
అంతేకాకుండా, “సుమన్ గారు, ఆమని గారు, మురళి గారు వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒక సినీ ప్రేమికుడిగా, ఒక సాధారణ ప్రేక్షకుడు ఎలాంటి సినిమాను ఇష్టపడతాడో ఊహించుకొని, అదే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దాను. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. బుక్ మై షోలో కూడా మా సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి ఆనందంగా ఉంది. నవంబర్ 14న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం,” అని ఆయన తెలిపారు.
