Satvika Veeravalli: ఒకవైపు డెబ్యూ మూవీ రిలీజ్.. మరోవైపు నాగచైతన్య సినిమాలో ఫిక్స్! అసలు ఎవరీ లక్కీ హీరోయిన్?

Satvika Veeravalli

Satvika Veeravalli

Satvika Veeravalli: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఏ కొత్త అమ్మాయికైనా తన మొదటి సినిమా ఫలితం తేలే వరకు తర్వాతి ఛాన్స్ రావడం కష్టమే. థియేటర్లలో ఆడియెన్స్ మార్కులు వేస్తే తప్ప పెద్ద బ్యానర్లు దగ్గరకు రావు. కానీ ఈ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ, తొలి సినిమా వెండితెరపై పడుతున్న రోజే స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది యంగ్ బ్యూటీ సాత్వికా వీరవల్లి. ఒకపక్క మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రిలీజ్ సందడి నడుస్తుండగానే, మరోపక్క అక్కినేని హీరో నాగచైతన్య తర్వాతి సినిమాలో హీరోయిన్‌గా లాక్ అయి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

సాత్వికా వీరవల్లి నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడిన ఆమె, సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు తిరిగి వచ్చారు. పవన్ సాధినేని డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ ఆమెకు మొదటి చిత్రం. ఈ మూవీ ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ అమ్మాయి గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. సినిమా పూర్తయిన తర్వాత ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఫుటేజ్ చూసినప్పుడే సాత్విక యాక్టింగ్ తనను కట్టిపడేసిందని ఆయన చెప్పారు. కొత్త అమ్మాయి అయినా ఎంతో అనుభవం ఉన్న నటిలా కనిపించిందని, అందుకే అప్పటికప్పుడే తమ బ్యానర్‌లో చేయబోయే తర్వాతి ప్రాజెక్ట్ కోసం ఆమెను ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.

తమ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలోనే సాత్వికను హీరోయిన్‌గా తీసుకున్నట్లు అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. నిజానికి ఈ విషయాన్ని ఇప్పుడే బయటపెట్టాలా వద్దా అని కాసేపు ఆలోచించినా, ఇంటర్వ్యూ మధ్యలోనే అరవింద్ ఈ సీక్రెట్ రివీల్ చేయడంతో పక్కనే ఉన్న దుల్కర్ సల్మాన్ కూడా షాక్ అయి, సాత్వికకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఫస్ట్ మూవీ రిలీజ్ రోజే సెకండ్ మూవీని నాగచైతన్య లాంటి హీరోతో ఖాయం చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ ఎవరు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

ఇదిలా ఉంటే, సాత్విక కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే భారీ చిత్రం ‘ఆర్సీ 17’లోనూ ఈమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, మొదటి సినిమా విడుదల కాకముందే దుల్కర్, నాగచైతన్య, రామ్ చరణ్ వంటి స్టార్ల లిస్టులో సాత్విక పేరు వినిపించడం మాత్రం నిజంగానే బిగ్ సర్‌ప్రైజ్.