Site icon NTV Telugu

ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా ‘సర్కారువారి పాట’

వచ్చే సంక్రాంతి బరిలో పోటీపడబోతున్న పందెం కోళ్ళ విషయంలో నిదానంగా క్లారిటీ వస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ యేడాది విడుదల కావాల్సిన ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం వచ్చే యేడాది జనవరి 13న విడుదల కావాల్సింది. కానీ ఎప్పుడైతే రాజమౌళి తన మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ను ఈ యేడాది చివరిలో కాకుండా, వచ్చే జనవరి 26న కాకుండా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తానని ప్రకటించాడో, మిగిలిన సినిమాల డేట్స్ మారే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేశారు. అయితే, జనవరి 12న వస్తానంటున్న పవన్ కళ్యాణ్‌ ‘భీమ్లా నాయక్’, జనవరి 14న రావాల్సి ఉన్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రాల విడుదల తేదీలో మాత్రం మార్పు లేదని ‘ట్రిపుల్ ఆర్’ మూవీ విడుదల తేదీ ప్రకటించిన తర్వాత కూడా నిర్మాతలు తెలిపారు. కానీ దీనికి నెల రోజుల పైనే సమయం ఉంది కాబట్టి, ఈ రెండు సినిమాలలో ఏదైనా వాయిదా పడుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం.

విశేషం ఏమంటే, ‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ కు ఒకరోజు ముందే, ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన అలియాభట్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా విడుదల కానుంది, ఆ సినిమాలో ‘ట్రిపుల్ ఆర్’లో కీలక పాత్ర పోషించిన అజయ్ దేవ్ గన్ సైతం నటించాడు. మరి ఈ ఇద్దరూ నటించిన ‘గంగూబాయి’ చిత్రం కూడా వాయిదా పడుతుందేమో చూడాలి. ఏదేమైనా… ఏప్రిల్ 1వ తేదీన తమ ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రిన్స్ మహేశ్ ఈ రోజు అధికారికంగా ప్రకటించడం విశేషం. ఎందుకంటే ఏప్రిల్ మాసం అనగానే మహేశ్ అభిమానులందరికీ బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’గుర్తొస్తుంది. సో… అలాంటి కెరీర్ హిట్ ను ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా ఇస్తుందేమో చూడాలి.

Exit mobile version