Sankranti 2027: 2027 సంక్రాంతి సినిమాల సందడి ఇప్పటి నుంచే మొదలైంది. పండక్కి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే పలువురు హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. ఈసారి సంక్రాంతి బరిలో రవితేజ, చిరంజీవి, వెంకటేశ్, శర్వానంద్ వంటి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడనున్నాయి. దీంతో టాలీవుడ్‌లో 2027 సంక్రాంతి సినిమా సీజన్‌పై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ‘ఇరుముడి’తో సూపర్ సక్సెస్ అందుకున్న మాస్ రాజా రవితేజ.. వెంటనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. హసిత్ గోలి డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దాగుడుమూతల దండాకోర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా ప్రకటించిన రోజే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించడం విశేషం. 2027 జనవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి సుమారు నాలుగు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి సినిమాల హడావుడికి వారం ముందే ‘మహాకాళి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 8న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి పూజా అపర్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టి టైటిల్ రోల్‌లో కనిపించనుండగా.. అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి అసలు సందడి జనవరి 12 నుంచి మొదలుకానుంది. వెంకటేశ్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఆ రోజున విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రతి సంక్రాంతికి తన సినిమాతో ప్రేక్షకులను పలకరించే అనిల్ రావిపూడికి ఈసారి గట్టి పోటీ ఎదురుకానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
వెంకటేశ్ సినిమా విడుదలైన మరుసటి రోజే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ థియేటర్లలోకి రానుంది. దీంతో ఈ మూవీ కోసం జనవరి 12న విడుదల కావాల్సిన సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతి సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ శర్వానంద్ కూడా మరోసారి పండక్కి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి సినిమాలతో సంక్రాంతి విజయాలు అందుకున్న శర్వా.. తాజాగా ‘నారి నారి నడుమ మురారి’తోనూ హిట్ అందుకున్నారు. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్‌ను కూడా జనవరి 14న బరిలోకి దింపనున్నట్లు పూజా కార్యక్రమాలు మొదలైన రోజే ప్రకటించారు. ఇలా జనవరి 8 నుంచి 14 వరకు వరుసగా పలు భారీ సినిమాలు థియేటర్లలోకి రానుండటంతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జనవరి 12 నుంచి 14 మధ్య స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదల కానుండటంతో థియేటర్ల కేటాయింపులు, వసూళ్ల పరంగా పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

