బద్రి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన రేణూ దేశాయ్, తరువాత పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణూ రెండో వివాహం చేసుకోకుండా తన పిల్లలు అకీరా నందన్, ఆద్యలను చూసుకుంటూ జీవిస్తోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో రేణూ తరచుగా ఫ్యాన్స్ ప్రశ్నలకు, కామెంట్లకు స్పందిస్తుంది. తాజాగా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఆమెపై వ్యక్తిగతంగా పరిమితమైన వ్యాఖ్య రాసాడు. “మేము మిమ్మల్ని ఇంకా పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో వేరొక మగాడిని ఊహించలేం” అని ఆ అభిమాని వ్యాఖ్యానించాడు.
Also Read : Rush Sindhu : మిస్ ఇంటర్నేషనల్ ఇండియా రూష్ సింధు ఎమోషనల్ రియాక్షన్..
దానికి రేణూ ఘాటుగా స్పందించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. “ఈ వ్యక్తి కొంత చదివి తెలుసుకున్నవాడే అనుకుంటున్నా, సోషల్ మీడియాలో ఇంగ్లీష్‌లో వ్యాఖ్య రాస్తున్నాడు. కానీ మనం 2025 లో ఉన్నప్పటికీ, స్త్రీలు భర్త లేదా తండ్రి ఆస్తి అని భావించే పితృస్వామిక ధోరణి ఇంకా ఉంది. మహిళలు చదవడం, ఉద్యోగం చేయడం కోసం ‘పర్మిషన్’ కోరుకోవడం తప్పు. మహిళలు వంటగదిలో మాత్రమే ఉండాలని, పిల్లలని చూడాలని భావించే మగవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. దీని వ్యతిరేకంగా నేను గళం విప్పుతాను. నా ఫాలోవర్స్ ఏమనుకుంటారో భయపడను. రాబోయే తరాల మహిళల కోసం మార్పు తీసుకురావడమే నా ప్రయత్నం. ఇక ఫెమినిజం అంటే వీకెండ్‌లో తాగి తిరగడం కాదు. మహిళలను పశువులుగా లేదా ఫర్నిచర్‌లా చూసే మైండ్‌సెట్‌ను ప్రశ్నించడం నిజమైన ఫెమినిజం. రాబోయే తరాలు ఈ విశ్వంలో తమ స్థానం సంపాదించాలి. గర్భహత్యలు, అన్యాయ మరణాలు ఇక ఉండకూడదు’ అంటూ రేణూ తన పోస్ట్‌తో పాటు ఆ ఫ్యాన్ చేసిన కామెంట్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. ఆమె స్పష్టమైన, ధైర్యమైన స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
