NTV Telugu Site icon

Martin : సినిమాకి బాడ్ రివ్యూ.. సోషల్ మీడియా స్టార్ అరెస్ట్!

Martin Review

Martin Review

నటుడు ధృవ సర్జా ‘మార్టిన్’ సినిమాపై విమర్శలు చేసినందుకు యూట్యూబర్ స్ట్రాంగ్ సుధాకర్ అలియాస్ సుధాకర్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మార్టిన్’ బ్యాడ్ రివ్యూలపై ధృవ సర్జా అభిమానులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మార్టిన్ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాపై అనుకూల, వ్యతిరేక చర్చలు జరుగుతున్నాయి. కొంత మంది బాగుందని వ్యాఖ్యానించగా, మరికొందరు సినిమా బాగోలేదని బ్యాడ్ రివ్యూలు ఇచ్చారు. తెలుగులో అయితే ఏకగ్రీవంగా సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి అనుకోండి, అది వేరే విషయం. నిజానికి సినిమా చూసిన ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చు. అయితే కన్నడలో ప్రముఖ యూట్యూబర్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్ట్రాంగ్ సుధాకర్ అలియాస్ సుధాకర్ గౌడ సినిమా గురించి బ్యాడ్ రివ్యూ ఇవ్వడంలో అందరినీ మించి పోయాడు. దీంతో మార్టిన్‌ హీరో ధృవ సర్జా అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Thandel : ఉక్కిరిబిక్కరవుతున్న తండేల్?

స్ట్రాంగ్ సుధాకర్ రూపొందించిన వీడియోలో ‘మార్టిన్ నా జీవితంలో నేను చూసిన చెత్త సినిమా. పాన్ ఇండియా సినిమా చేయడానికి అందరూ కేజీఎఫ్ సినిమాను కాపీ కొడుతున్నారు. కేజీఎఫ్ సినిమా తరహాలోనే ఉపేంద్ర సినిమా ‘కబ్జా’ పేలవంగా తయారైంది. కబ్జా చిత్రానికి కొనసాగింపు మార్టిన్ కూడా తరహాలోనే రూపొందించారని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. దీనికి సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్, కామెంట్స్ వచ్చాయి. మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పోలీసులు సినిమా గురించి చెడుగా రివ్యూ ఇచ్చిన వీడియోను తొలగించారు. అంతేకాకుండా, సుధాకర్‌ను పోలీస్ స్టేషన్‌లో ఉంచి వార్నింగ్ ఇవ్వగా అతను తప్పు ఒప్పుకుంటూ ఒక క్షమాపణ లేఖ వ్రాసి వీడియోను తొలగించాడు. అయితే సుధాకర్ గౌడను పోలీసులు దాడి కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో సుధాకర్‌పై దాడి కేసు ఉన్నందున అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సుధాకర్‌పై వారెంట్ కూడా జారీ అయింది. ఇప్పుడు దాడి కేసులో స్ట్రాంగ్ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Show comments