టాలీవుడ్, బాలీవుడ్‌లో ఒకేసారి దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సినిమాలతో పాటు సోషల్ మీడియా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చర్చలు, గాసిప్‌లు కూడా ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన మనసులో మాటను పంచుకున్నారు. ట్రోలింగ్, నెగెటివిటీని ఎలా ఎదుర్కొంటారో, ఎందుకు తన భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేయనని స్పష్టంగా వెల్లడించారు.
రష్మిక మాట్లాడుతూ.. ‘నేను చాలా ఎమోషనల్ పర్సన్, అలాగే రియల్ పర్సన్‌ని. కానీ నా భావోద్వేగాలను అందరి ముందు ప్రదర్శించను. ఎందుకంటే చాలా మంది నా దయాగుణాన్ని అసత్యంగా అనుకుంటారు. దాన్ని నా బలహీనతగా భావిస్తారు. పైగా, నేను కెమెరాల కోసం చేస్తున్నానని అపార్థం చేసుకుంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే, అంత వ్యతిరేకత మనపై వస్తుంది. దయాగుణం అనేది వ్యక్తిగత ఎంపిక మాత్రమే, దీని వల్ల తనకు ఎలాంటి లాభం లేకపోయినా తాను దయతోనే ఉంటా. నెగెటివిటీని, ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. మీలో దయ లేకపోతే, ఎవరిని బాధ పెట్టకండి.. ఎదగడానికి ఇతరులను తోక్కాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచం పెద్దది, మనందరికీ స్థలం ఉంది. అందుకే, ఆన్‌లైన్ నెగెటివిటీని ఎదుర్కొంటూ, తన ప్రయాణంపైనే దృష్టి పెడుతున్నా. ఎన్ని విమర్శలు ఎదురైనా, వాటి ప్రభావం నాపై పడనివ్వకుండా క్రమశిక్షణతో ముందుకు సాగుతున్న’ అంటూ తెలిపింది. రష్మిక మాటల్లో నిజాయితీ, అనుభవం, ధైర్యం స్పష్టంగా కనిపిస్తాయి. విమర్శలు, ట్రోల్స్ మధ్య కూడా దయను కోల్పోకుండా, తన ప్రయాణాన్ని కొనసాగించడం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
