“ఛలో” చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం రష్మిక మందన్న ఆ తరువాత వెనక్కి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకదాని తరువాత ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె ప్రయాణం ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్తోంది. అయితే ఈ అమ్మడికి అవకాశాలతో పాటు క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. తాజాగా ఆమె అభిమానుల్లో ఒకరు రష్మికను కలవడానికి పెద్ద సాహసమే చేశాడు. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే అభిమాని రష్మిక మందన్నను కలవాలనే కోరికతో 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే అంతకుముందే అతను గూగుల్ లో రష్మిక చిరునామా కోసం సెర్చ్ చేశాడట. ఆ తరువాత ఆకాష్ తెలంగాణ నుండి మైసూర్ రైలులో, కొడగు జిల్లాలోని ముగ్లాకు ఆటో రిక్షాలో చేరుకున్నాడు. అయితే తీరా అక్కడికి వెళ్ళాక తన అభిమాన నటి అడ్రెస్ ను కనుక్కోలేకపోయాడు. దీంతో అక్కడే నివాసం ఉండే వ్యక్తులను అడిగి రష్మిక ఇంటి అడ్రెస్ కోసం ఆరా తీయడం మొదలెట్టాడట. దీంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారట. అక్కడి పోలీసులు ఆ వ్యక్తి వివరాలు కనుక్కుని, ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని తన ఇంట్లో లేదని చెప్పి, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారట. తన అభిమాన నటిని కలవాలని అభిలాషతో అంతదూరం ప్రయాణం చేసి వెళ్లిన అతనికి నిరాశ తప్పలేదు.
Read Also : సోనూసూద్ కు 12 మిలియన్ల ‘అనుసర’ గణం!
ఈ విషయం కాస్తా రష్మిక దృష్టికి వెళ్లిందట. దీంతో ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది. “గైస్ మీలో ఒకరు చాలా దూరం ప్రయాణించి నన్ను చూడటానికి ఇంటికి వెళ్ళారని నా దృష్టికి వచ్చింది. దయచేసి అలాంటిదేమీ చేయకండి. నేను మిమ్మల్ని కలవలేకపోయానని బాధగా ఉంటుంది. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. కానీ ప్రస్తుతానికి ఇక్కడ (సోషల్ మీడియా) నాపై ప్రేమ చూపించండి. నేను చాలా సంతోషిస్తాను” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా “మిషన్ మజ్ను” చిత్రీకరణ కోసం రష్మిక మండన్న ముంబై లో ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప”, అమితాబ్ బచ్చన్ “గుడ్ బై” చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ కన్నడ భామ.