Rashmika: నిన్నటి వరకు టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఆమె పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిసేది. ఆమె సినిమాలో ఉంటే చాలు హీరోలకు బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అనే స్థాయికి చేరి, పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ ‘లేడీ లక్’గా మారిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అయితే ఇప్పుడు ఆ మ్యాజిక్ క్రమంగా మసకబారుతోందా అన్న అనుమానాలు సినీ వర్గాల్లో బలపడుతున్నాయి. మొన్నటిదాకా తిరుగులేని విజయాలతో దూసుకెళ్లిన ఈ భామ సక్సెస్ గ్రాఫ్, ఇటీవల వరుస పరాజయాలతో నెమ్మదిగా నేల చూపులు చూస్తోంది. ‘థామా’ సమయం నుంచి మొదలైన రష్మిక నెగటివ్ ట్రాక్ బాక్సాఫీస్ వద్ద ఆమె స్టార్‌డమ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటన పరంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ, కమర్షియల్‌గా మాత్రం ఆ సినిమా నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది ఆమె నుంచి వచ్చిన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. బాలీవుడ్లో గ్లామరస్‌గా కనిపించిన ‘కాక్టైల్ 2’ కంటెంట్ లోపం వల్ల బీటౌన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
మరోవైపు టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘రణబాలి’లో ఆమె నటనకు మంచి స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తీసుకున్న అతి లిబర్టీ సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. దీంతో బ్రేక్ ఈవెన్ మార్కుకు అతి చేరువలోకి వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు పడటంతో రష్మిక మార్కెట్ విలువపై తీవ్ర చర్చ మొదలైంది. వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో రష్మిక ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ (ఫీమేల్ సెంట్రిక్) చిత్రాలపైనే పూర్తి భరోసా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాబోతున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘మైసా’. మునుపెన్నడూ చూడని విధంగా భారీ వైలెన్స్, ఊరమాస్ లుక్‌తో ఇందులో రష్మిక కనిపించబోతోంది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో తనేంటో బాక్సాఫీస్ వద్ద మరోసారి నిరూపించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా రిజల్ట్‌పైనే ఆమె తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఎంఎస్ సుబ్బలక్ష్మి’ మార్కెట్ పూర్తిగా ఆధారపడి ఉంది. మరోవైపు అల్లు అర్జున్‌తో కలిసి ‘రాకా’లోనూ జతకట్టబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి నవంబర్ 27న రాబోతున్న ‘మైసా’తో రష్మిక మళ్లీ తన గోల్డెన్ ఫామ్‌ను అందుకుని విమర్శకుల నోళ్లు మూయిస్తుందో లేదో చూడాలి.

