NTV Telugu Site icon

ఆ పాత మథురమైన చిత్రాలు… సుమథుర జ్ఞాపకాలు… ఇకపై భద్రం!

Rare Treasure': NFAI Adds Over 450 Glass Slides Of Early Telugu Cinema From 1939 To 1955 To Its Collection

నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్‌ ఇండియా (ఎన్ఎఫ్‌ఏఐ) రెగ్యులర్ గా సినిమాలకు సంబంధించిన వివిధ అంశాల్ని, సామాగ్రిని, విశేషాల్ని భద్రపరుస్తూ ఉంటుంది. వీలైనన్ని సినిమాల ప్రింట్స్ తమ వద్ద ఉండేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. భవిష్యత్తులో సినిమాకు సంబంధించి, సినిమా చరిత్రకు సంబంధించి ఏదైనా అధ్యయనం, పరిశోధన చేస్తే అందుకు ఉపయోగపడేలా రకరకాల మూవీ స్పెషల్స్ ని ఎన్ఎఫ్ఏఐ నిరంతరంగా అన్వేషించి భద్రపరుస్తుంది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ చిత్రం ‘పీకే’ నెగటివ్ ప్రింట్లను కూడా సేకరించారు. ఇప్పుడంతా మెమరీ కార్డ్స్ ఆధారంగా డిజిటల్ రికార్డింగ్ జరిగిపోతోంది. బాలీవుడ్ లో నెగటివ్ రీల్ పై చిత్రించిన చివరి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘పీకే’ కూడా ఒకటి. అందుకే, ప్రత్యేకంగా నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ లో భద్రపరిచారు.

Read Also : పాపులర్ మ్యూజిక్ సంస్థకు “సర్కారు వారి పాట” ఆడియో రైట్స్

తాజాగా తెలుగు సినిమాల మీద కూడా కేంద్ర సమాచార, ప్రసార శాఖ దృష్టి పెట్టింది. ఒకప్పటి మేటి తెలుగు సినిమాల తాలూకూ గ్లాస్ స్లైడ్స్ ని వివిధ పద్ధతుల్లో సేకరించి భద్రపరిచారు. మొత్తం 450 గ్లాస్ స్లైడ్స్ ప్రస్తుతం ఎన్ఎఫ్ఏఐ వద్ద ఉన్నాయి. వీటి వల్ల 1930ల నుంచీ 1950ల వరకూ సాగిన తెలుగు సినిమా ప్రస్థానం చిత్రాల రూపంలో అందుబాటులో ఉంటుంది. గ్లాస్ స్లైడ్స్ ఆనాటి సినిమా రంగం స్థితిని, సమాజం పోకడని పట్టి చూపిస్తాయి. ‘మళ్లీ పెళ్లి, వందే మాతరం, కీలు గుర్రుం, దాసీ, దేవదాసు’ వంటి ఎన్నో ఆపాత మథురమైన చిత్రాలు జాబితాలో ఉండటం విశేషం.

గతంలోనూ పాత సినిమాలకు సంబంధించిన గ్లాస్ సైడ్స్ సేకరించిన ఎన్ఎఫ్ఏఐ ఇప్పటి వరకూ మొత్తం 2వేలకు పైగా నమూనాలు భద్రపరిచింది. హిందీ, గుజరాతీ, తెలుగు చిత్రాలు అందులో ఉన్నాయి. ముందు ముందు మరిన్ని భాషలు, సినిమాలపై దృష్టి పెట్టబోతున్నారు. కేవలం గ్లాస్ స్లైడ్సే కాదు నెగటివ్స్, పోస్టర్స్, లాబీ కార్డ్స్, ఫుటేజెస్, ఫోటోస్… ఇలా సినిమాకు సంబంధించిన ఏదైనా సరే… కేంద్ర ప్రభుత్వం భద్రపరిచే ప్రయత్నంలో ఉంది. ఎవరి వద్దనైనా సినిమాకు సంబంధించి ఎటువంటి విశేష సామాగ్రి ఉన్నా తమకు అందించాలని ఎన్ఎఫ్ఏఐ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు…