Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ వైవాహిక జీవితంపై గత కొన్నేళ్లుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని, మనస్పర్థల వల్ల దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో తరచూ ప్రచారం జరుగుతుంటుంది. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై ఎక్కడా స్పందించని రమ్యకృష్ణ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ పుకార్లన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టారు. తాము ఎందుకు వేర్వేరు నగరాల్లో ఉంటున్నామో వివరిస్తూనే, తమ బంధం గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
విడాకుల వార్తలపై రమ్యకృష్ణ స్పందిస్తూ.. “మేము వంద శాతం ఇంకా భార్యాభర్తలమే. మా పెళ్లి బంధం చెక్కుచెదరలేదు” అని తేల్చి చెప్పారు. అయితే, వృత్తిపరమైన అవసరాలు, కొడుకు రిత్విక్ చదువు కారణంగా తాము చెన్నై, హైదరాబాద్ నగరాల్లో వేర్వేరుగా నివసిస్తున్నామని స్పష్టం చేశారు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని చెబుతూ.. గతంలో తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు టీవీ సీరియల్స్ నిర్మాణ పనుల కోసం ప్రతి 15 రోజులకు ఒకసారి చెన్నైకి వెళ్లి రావాల్సి వచ్చేదని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం, బంద్‌లు, స్కూల్ సెలవుల వల్ల కొడుకు చదువుకు ఆటంకం కలగడంతో పాటు, తాను ఊరు వెళ్లినప్పుడల్లా బాబు అనారోగ్యానికి గురయ్యేవాడని తెలిపారు. దీంతో కృష్ణవంశీతో పరస్పర అంగీకారంతోనే కొడుకుని చెన్నై స్కూల్లో చేర్పించి తాను అక్కడే ఉండిపోయానని వివరించారు.
ఇలా వేర్వేరు నగరాల్లో ఉండటం కాలక్రమేణా ఇద్దరికీ ఎంతో సౌకర్యవంతంగా మారిందని రమ్యకృష్ణ అన్నారు. “కృష్ణవంశీ ఒక క్రియేటివ్ పర్సన్. ఆయనకు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సినిమా తప్ప మరో ధ్యాస ఉండదు. మేము వేర్వేరుగా ఉండటం వల్ల ఇద్దరికీ కావాల్సినంత వ్యక్తిగత స్పేస్ దొరికింది. రోజూ చిన్నచిన్న విషయాలకు గొడవలు పడకుండా, ఇప్పుడు మేము చాలా మంచి స్నేహితుల్లా ఉంటున్నాం. బహుశా ఈ స్పేస్ వల్లే మా పెళ్లి ఇంత బలంగా నిలబడిందేమో” అని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణవంశీ సినిమాల గురించి చెబుతూ రమ్యకృష్ణ ఒక సరదా విషయాన్ని పంచుకున్నారు. గతంలో ‘శ్రీ ఆంజనేయం’ సినిమా ఎడిటింగ్ వెర్షన్ చూసిన తర్వాత, సెకండాఫ్ తనకు నచ్చలేదని తాను మొహం మీదే చెప్పానని అన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కృష్ణవంశీ తనకు ఒక్క సినిమా కథ కూడా చెప్పడం మానేశారని నవ్వుతూ వెల్లడించారు. ఒకరి పనుల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉండటమే తమ బంధం సాఫీగా సాగడానికి కారణమని చెప్పారు.
అంతేకాదు, వివాహ వ్యవస్థపై తన అభిప్రాయాన్ని చెబుతూ కొన్నిసార్లు పెళ్లి అనేది కొంచెం ఓవర్రేటెడ్గా అనిపిస్తుందని రమ్యకృష్ణ పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటే ఇరువైపులా కుటుంబాలు, బంధువులు అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. నిజానికి తమ పెళ్లికి ముందే కృష్ణవంశీ “పెళ్లి ఎందుకు? మనం లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉందాం” అని చాలాసార్లు అడిగారని, అప్పుడే తాను ఆ మాట విని ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఏదేమైనా తమ మధ్య ఉన్న బంధం ఎప్పటికీ పర్ఫెక్ట్గా ఉంటుందని స్పష్టం చేస్తూ రమ్యకృష్ణ ఈ పుకార్లకు తెరదించారు.

