Sunny Deol as Hanuman: నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ భారీ హిట్ అందుకుంది. రామాయణ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,500 కోట్ల మార్కును దాటేసి.. 2 వేల కోట్ల దిశగా దూసుకెళుతోంది. రామాయణ పార్ట్ 2 తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ ఇతిహాస గాథను మూడో భాగంతోనూ కొనసాగించే ఆలోచన ఉందా? అనే చర్చ తాజాగా మొదలైంది. ఈ నేపథ్యంలో సినిమాలో మహర్షి విశ్వామిత్రుడి పాత్ర పోషిస్తున్న నటుడు అజింక్య దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడో భాగం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెబుతూనే.. ఒకవేళ మేకర్స్ అలాంటి నిర్ణయం తీసుకుంటే తాను ఎంతో సంతోషిస్తానని తెలిపారు.
ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజింక్య దేవ్ మాట్లాడుతూ.. ‘రామాయణ పార్ట్ 3 గురించి నేను వినలేదు. అందుకే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. అయితే చిత్ర నిర్మాతల్లో ఎవరైనా ఈ విషయాన్ని ప్రస్తావించి ఉంటే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా జరిగితే సినిమాలో నా పాత్రకు మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంటుంది. మూడో భాగంతో ఎందుకు ఆగిపోవాలి?.. ఐదు భాగాలుగా తెరకెక్కించినా బాగుంటుంది’ అని సరదాగా అన్నారు. రెండో భాగం షూటింగ్ గురించి కూడా అజింక్య కీలక విషయాలు పంచుకున్నారు. ‘ఇప్పటికే సినిమా రెండో భాగానికి సంబంధించిన చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ముఖ్యంగా హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనుండటం ఈ భాగానికి ప్రధాన ఆకర్షణ’ అని పేర్కొన్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ పార్ట్ 1’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. వీరితో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, ఆదినాథ్ కోఠారే, అరుణ్ గోవిల్, లారా దత్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ.1,500 కోట్ల వసూళ్ల క్లబ్‌లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. పార్ట్ 2ను 2028లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

