YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!

Cinema (3)

Cinema (3)

యూట్యూబ్‌లో ‘నందూస్ వరల్డ్’ ఛానల్‌తో ఆదరణ దక్కించుకున్న ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రమా నందన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలు, సెప్టెంబర్ 7న శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల అనంతరం ఆమె తొలిసారి స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పోస్టులో రమా నందన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సెప్టెంబర్ 7న నా జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదురవడానికి కొద్ది నిమిషాల ముందే నేను విమానాశ్రయంలో అడుగుపెట్టాను. నేనేదో టీవీ షోల కోసమో, పబ్లిసిటీ కోసమో ముందుకు రాలేదు. నిజానికి ఎన్నో అవకాశాలు వచ్చినా పక్కన పెట్టి, ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని నేనే స్వయంగా ముందుకొచ్చాను. మా కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలోకి మా పేర్లను, పరువును కావాలనే లాగుతున్నారు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, “నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. నిజం కోసం నిలబడతాను, ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో అన్ని నిజాలు బయటకు వస్తాయి. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు కచ్చితంగా జవాబుదారీ అవుతారు. ఇది నేనేదో సీన్ క్రియేట్ చేయడం కోసం కాదు.. నా కుటుంబ గౌరవాన్ని, నిజాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న పోరాటం. కన్నీళ్లు రావచ్చు, ఎంతో బాధ కలగవచ్చు, గడ్డు పరిస్థితులు ఎదురవ్వచ్చు.. కానీ నేను చేయని తప్పుకు ఎప్పటికీ తలదించను. కుంగిపోతానేమో కానీ ఓడిపోను.. నిటారుగా నిలబడి పోరాడతాను” అని రమా నందన స్పష్టం చేశారు.

యూకే జాబ్స్, వీసా స్పాన్సర్‌షిప్ వివాదంలో కేసులు నమోదై, ఎయిర్‌పోర్టులో లుకౌట్ నోటీసుల వ్యవహారం నడిచిన తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం. తనపై కావాలనే కుట్ర జరిగిందని, అసలు దోషులు వేరే ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె నిర్దోషిత్వాన్ని నమ్ముతూ ఫాలోవర్లు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా, మరోవైపు బాధితులు మాత్రం చట్టపరంగా నిజాలు తేలాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.