Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్‌లో చరణ్‌కు ఏమైందో చెప్పిన నిర్మాత!

Tollywood

Tollywood

Satish Kilaru: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకు సంబంధించి కీలక విశేషాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నిర్మాతగా నా తొలి సినిమా రామ్ చరణ్ గారితో చేయడం నా అదృష్టం. ‘పెద్ది’ టైటిల్ కార్డ్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులు సీట్ నుంచి కదలలేరు. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ పెద్దిలో ఫుల్ ప్యాక్డ్ గా ఉన్నాయి. రంగస్థలం షూటింగ్ సమయంలో నాకు ఒక సినిమా చేసి పెట్టాలని చరణ్ గారిని అడిగాను. నిజానికి రెండు మూడు సందర్భాల్లో చేయాల్సిన సినిమాలు మిస్ అయ్యాయి, చివరికి బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా నిర్మించాను. కేవలం ఇచ్చిన మాట మీద ఆయన సినిమా చేశారు. ఎలాంటి అగ్రిమెంట్ల లాంటివి కూడా జరగలేదు. ఇది నేను అనుకుంటే అయ్యింది కాదు రామ్ చరణ్ అనుకున్నారు కాబట్టే జరిగింది’ అని అన్నారు.

పెద్ది షూటింగ్ సమయంలో హీరో రామ్ చరణ్‌కి ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలయ్యాయని చెప్పారు. నిజానికి ఆ మూడు మేజర్ ఇంజ్యూరీస్ అయినా డేట్స్ ఇబ్బంది అవ్వకూడదని, గాయం తగిలిన తర్వాతి రోజు కూడా ఆయన షూట్‌కి వచ్చేసేవారు అని చెప్పారు. పెద్ది సినిమాకి రామ్ చరణ్ సపోర్ట్ ఏమాత్రం మరవలేనిది అన్నారు. తాజాగా ముంబైలో రామ్ చరణ్ చేతికి బ్రేసెస్‌తో కనిపించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా వెంకట సతీష్ కిలారు వైరల్ అవుతున్న ఫోటోకు సంబంధించిన క్లారిటీని ఇచ్చారు. కుస్తీ ఫైట్ జరుగుతున్నప్పుడు ఆయనకు మణికట్టుకు గాయమైంది.. దానికి ఆయనకి ఎల్లుండి సర్జరీ చేయబోతున్నారని చెప్పారు.