మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఈ మేకర్స్ నుంచి ఈ ప్రకటన రాగా… అప్పుడే సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరిగిపోయాయి. అయితే తాజాగా “ఆర్‌సి 15” టీం రామ్ చరణ్, శంకర్ లతో పాటు చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా కలిసి ఉన్న పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ ఈ పిక్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ “నిన్న చెన్నైలో అద్భుతమైన రోజు గడిపాము. ఇంత గొప్ప అతిథ్యం ఇచ్చిన శంకర్ సర్, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ‘ఆర్‌సి 15’ కోసం ఎదురు చూస్తున్నాము, త్వరలోనే అప్డేట్స్ వస్తాయి” అంటూ పోస్ట్ చేశారు. చెన్నైలో కలుసుకున్న ఈ టీం సినిమా గురించి చర్చించినట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న 50వ చిత్రమైన “ఆర్‌సి 15” ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
Read Also : బన్నీకి ఝలక్ ఇచ్చిన చెర్రీ సినిమా!
ఇదిలావుండగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి. దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎం. ఎం.కీరవణి సంగీతం అందిస్తున్నారు. “ఆర్‌ఆర్‌ఆర్”లో అజయ్ దేవ్‌గన్, అలియా భట్ లతో పాటు పలువురు నటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తరువాతే “ఆర్‌సి 15” ప్రారంభం కానుంది.
