Rakul Preet Singh: టాలీవుడ్ అన్నీ ఇచ్చింది.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!

Rakul Preet Singh Tollywood

Rakul Preet Singh Tollywood

Rakul Preet Singh on Tollywood: రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ముఖ్యంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రకుల్ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్ తనకు అన్నీ ఇచ్చిందని, నటిగా తనను తీర్చిదిద్దింది తెలుగు చిత్ర పరిశ్రమే పేర్కొన్నారు.

2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో సినీ రంగ ప్రవేశం చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. 2011లో ‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘జయ జానకీ నాయక’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ‘కరెంట్ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్ 2’, ‘బ్రూస్ లీ’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘విన్నర్’, ‘స్పైడర్’, ‘చెక్’, ‘కొండపొలం’ వంటి సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించారు. 2024 ఫిబ్రవరి 21న బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న రకుల్.. ప్రస్తుతం హిందీ సినిమాల్లో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో శూర్పణఖ పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, టాలీవుడ్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. రకుల్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ ఆరంభంలో పెట్టుకున్న లక్ష్యంలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. మొదటి నుంచి కష్టపడి పనిచేయడమే నాకు తెలుసు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి టాలీవుడ్‌ కారణం. తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను మంచి నటిగా తీర్చిదిద్దింది. అన్ని రకాల పాత్రలు చేసేందుకు సిద్ధమయ్యేలా చేసింది. నా పనికి ఉన్న విలువేంటో తెలియజేసింది. స్టార్‌డమ్‌తో పాటు నేను కోరుకున్న ప్రతిదాన్ని ఇచ్చింది’ అంటూ భావోద్వేగం చెందారు.

ప్రస్తుతం తాను వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ‘రామాయణ’లో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, సవాలుతో కూడిన పాత్రలు చేయడం తనకు ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. విభిన్నమైన పాత్రలను అన్వేషిస్తూ, కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. టాలీవుడ్ తనకు నటిగా గుర్తింపు, స్టార్‌డమ్‌తో పాటు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.