NTV Telugu Site icon

‘రాధే’ – డీఎస్పీ మధ్యలో ఆదిత్య!

Radhe : Seetimaar Song Controversy

ఇటీవల తమిళ దర్శకుడు ఎస్. శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తాననే సరికీ ఆ చిత్ర తమిళ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ మోకాలడ్డుపెట్టాడు. నిర్మాతగా ఆ సినిమా కథాహక్కులు తనవే అని క్లయిమ్ చేశాడు. అయితే ఆ కథను తయారు చేసిన రచయితగా ఆ హక్కులు తనకే ఉంటాయని శంకర్ వాదిస్తున్నాడు. తాజాగా ‘రాధే’ సినిమా పాట విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన చర్చే చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘డి.జె. దువ్వాడ జగన్నాథం’ కోసం స్వరపరిచిన సీటీమార్ పాటను సల్మాన్ ఖాన్ తన ‘రాధే’ చిత్రంలో వాడుకున్నాడు. అందుకు డీఎస్పీ అనుమతి ఇచ్చాడు. ఇటీవలే ఆ పాటను హిందీలో జీ మ్యూజిక్ సంస్థ విడుదల చేసింది. తెలుగులో ‘డీజే’ మూవీ ఆడియో హక్కులను దిల్ రాజు ఆదిత్య మ్యూజిక్ సంస్థకు ఇచ్చాడు. సో… టెక్నికల్ గా సీటీమార్ సాంగ్ ట్యూన్ మీద హక్కులు ఆదిత్య సంస్థకు చెందుతాయని కొందరంటున్నారు. సహజంగా నిర్మాతలు తమ చిత్రాల రీమేక్ హక్కులు వేరొకరికి ఇచ్చినప్పుడు రచయితలకూ కొంత పారితోషికం ఇస్తారు. అలానే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కు ‘సీటీమార్’ పాటపై దాని స్వరకర్తగా క్రియేటివ్ రైట్స్ ఉన్నా… దాని హక్కులను డబ్బులు చెల్లించి కొన్న ఆదిత్య మ్యూజిక్ సంస్థకూ ఉంటుంది. సో… ఇప్పుడు ఈ సినిమా పాట హక్కుల విషయమై జీ మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్ మధ్య ఓ కొత్త వైరానికి తెర తీసినట్టు అయ్యింది. అయితే… ఇక్కడ ఎలాంటి వివాదానికి తావులేకుండా సమస్యను పరిష్కరించుకున్నామని దేవిశ్రీ ప్రసాద్ చెబుతున్నాడు. మరి ఇందులోని నిజానిజాలు నిలకడ మీద గానీ తెలియవు.