Site icon NTV Telugu

V.B RAJENDRAPRASAD: ‘జగపతి’ బాబు రాజేంద్రప్రసాద్!

Jagapathi

Jagapathi

Producer & Director V.B RAJENDRAPRASAD: తెలుగు చిత్రసీమలో ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి, జనం మదిలో నిలచిపోయారు. అలాంటి వారిలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. నిర్మాతగానే కాకుండా, దర్శకునిగానూ రాజేంద్రప్రసాద్ ఆకట్టుకున్నారు. ‘జగపతి’ బ్యానర్ కు జనం మదిలో ఓ తరిగిపోని స్థానం సంపాదించారు. తన చిత్రాలలో పాటలకు పెద్ద పీట వేసేవారు రాజేంద్రప్రసాద్. తరువాతి రోజుల్లో తన సినిమాల్లోని పాటలను కలిపి, కాసింత వ్యాఖ్యానం జోడించి, ‘చిటపటచినుకులు’ అనే మకుటంతో రెండు భాగాలుగా విడుదల చేసి, అలరించారు. ఈ తీరున ఆకట్టుకున్న నిర్మాత-దర్శకుడు మరొకరు కానరారు.

వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్ 1932 నవంబర్ 4న జన్మించారు. కృష్ణాజిల్లా డోకిపర్రు గ్రామం ఆయన స్వస్థలం. ఆయన కన్నవారు లక్ష్మీనరసమ్మ, జగపతి చౌదరి. వ్యవసాయ కుటుంబం. ఆర్థిక బలం బాగుండేది. దాంతో రాజేంద్రప్రసాద్ చదువుకుంటూనే నాటకాలలో వేషాలు వేస్తూ, సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. తరువాతి రోజుల్లో అభిరుచి గల నిర్మాతగా పేరొందిన ‘శంకరాభరణం’ ఏడిద నాగేశ్వరరావు ఆయనకు బాల్యమిత్రులు. వారిద్దరూ కలసి ‘రాఘవ కళాసమితి’ అనే సాంస్కృతిక సంస్థను నెలకొల్పి, ఆ బ్యానర్ పైనే నాటకాలు వేసేవారు. ‘ఇన్ స్పెక్టర్ జనరల్’ అనే నాటకంలో స్త్రీ పాత్ర ధరించి, ఉత్తమకథానాయికగా అవార్డునూ సంపాదించారు. నటుడవ్వాలని మద్రాసు చేరారు రాజేంద్రప్రసాద్. అక్కడ తన అభిమాన హీరో ఏయన్నార్ ను కలుసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతో కొన్ని సినిమాల్లో ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. దాంతో తన తండ్రి పేరిటి ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ పతాకం స్థాపించి, తొలి ప్రయత్నంగా జగ్గయ్య కథానాయకునిగా, జమున నాయికగా ‘అన్నపూర్ణ’ చిత్రం నిర్మించారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాతగా రాజేంద్రప్రసాద్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది.

Read also:Happy Birthday Tabu: అభినయమే టబు ఆయుధం!

తొలి చిత్రం ‘అన్నపూర్ణ’ కాగానే, తన అభిమాన కథానాయకుడు ఏయన్నార్ తో ‘ఆరాధన’ నిర్మించారు. ఆ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. అప్పటి నుంచీ ఏయన్నార్ తోనే సినిమాలు నిర్మిస్తూ సాగారు. అలాగే తన సినిమా టైటిల్స్ అన్నీ ఇంగ్లిష్ అక్షరం ‘ఎ’తో ఆరంభమయ్యేలా చూసుకొనేవారు. “ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు” వరకు వి.మధుసూదనరావు దర్శకత్వంలోనే చిత్రాలను నిర్మించారు రాజేంద్రప్రసాద్. తరువాత ఎడిటర్ ఎ.సంజీవి దర్శకత్వంలో ‘అక్కాచెల్లెలు’ నిర్మించారు. ఆపై ఏయన్నార్ ప్రోత్సాహంతో తానే డైరెక్టర్ గా మారి ‘దసరాబుల్లోడు’ నిర్మించారు. ఈ రంగుల చిత్రం 1971లో బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఏయన్నార్ కు తొలి స్వర్ణోత్సవంగానూ ‘దసరాబుల్లోడు’ చరిత్రకెక్కింది. ఆ పై అక్కినేనితో “బంగారుబాబు, బంగారుబొమ్మలు, రామకృష్ణులు, ఎస్పీ భయంకర్, భార్యాభర్తల బంధం” వంటి చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించారు. వీటిలో ‘రామకృష్ణులు’లో యన్టీఆర్, ‘భార్యాభర్తల బంధం’లో రామారావు తనయుడు బాలకృష్ణ ఏయన్నార్ తో కలసి నటించడం విశేషం.

శోభన్ బాబు హీరోగా “మంచిమనసులు, పిచ్చిమారాజు” చిత్రాలను రూపొందించారు రాజేంద్ర ప్రసాద్. తమిళంలో ‘బంగారుబాబు’ రీమేక్ గా ‘ఎంగల్ తంగ రాజా’ తెరకెక్కించి విజయం సాధించారు. హిందీలో ‘దసరా బుల్లోడు’ రీమేక్ గా ‘రాస్తే ప్యార్ కీ’ నిర్మించారు. అక్కినేని ఆనందరావు నిర్మించిన ‘అందరూ దొంగలే’ చిత్రానికి వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. హిందీలో విజయం సాధించిన ‘విక్టోరియా 203’ఆధారంగా ‘అందరూ దొంగలే’ తెరకెక్కింది. తెలుగులోనూ మంచి ఆదరణ చూరగొందీ చిత్రం.
తరువాతి రోజుల్లో బాలకృష్ణ హీరోగా ‘బంగారుబుల్లోడు’ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నిర్మించగా, ఆ సినిమా ఘనవిజయం సాధించింది. నాగార్జున హీరోగా స్వీయ దర్శకత్వంలో వి.బి.రాజేంద్రప్రసాద్ ‘కెప్టెన్ నాగార్జున’ నిర్మించారు. తరువాత నాగ్ హీరోగా ఫాజిల్ డైరెక్షన్ లో ‘కిల్లర్’ రూపొందించారు. తనయుడు జగపతిబాబును హీరోగా పరిచయం చేస్తూ వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘సింహస్వప్నం’ నిర్మించారు. ఆ తరువాత తనయుడు హీరోగా ‘భలే బుల్లోడు, పెళ్ళిపీటలు’ వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఆ సినిమాలేవీ అంతగా అలరించలేకపోయాయి. అప్పటి నుంచీ సినిమాలకు దూరంగా జరిగారు రాజేంద్రప్రసాద్.

హైదరాబాద్ లో తెలుగు చిత్రసీమ నెలకొనడానికి కృషి చేసిన వారిలో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఫిలిమ్ నగర్ హౌసింగ్ సొసైటీకి ఆయన చాలా రోజులు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన హయాములోనే ఫిలిమ్ నగర్ లో దైవసన్నిధానం నిర్మాణం సాగడం విశేషం. ఆ దేవస్థానానికి చివరి దాకా రాజేంద్రప్రసాద్ ఛైర్మన్ గా సేవలు అందించారు. 2015 జనవరి 15న వి.బి.రాజేంద్రప్రసాద్ తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్ భౌతికంగా దూరమైనా, ఆయన చిత్రాల ద్వారా తెలుగువారి మనసుల్లో ఈ నాటికీ చెరగని ముద్ర వేసుకొనే ఉన్నారు.
Kishan Reddy: సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవోలు

Exit mobile version