బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి ప్రియాంక చోప్రా. తన అందం, ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలసి ‘SSMB 29’ చిత్రంలో నటిస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడమే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో మరోసారి ప్రభంజనం సృష్టించడానికి ప్రియాంక సిద్ధమవుతోంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో హీరోయిన్ల పరిస్థితి, అక్కడి మేల్ డామినేషన్‌పై ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా మాట్లాడింది.
ప్రియాంక మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో మగవారి ఆధిక్యం ఎంత ఉందో అందరికీ తెలుసు. సెట్స్‌లో మేమూ హీరోలతో సమానంగా కష్టపడతాం. వారు ఎంత కష్టపడతారో మేము అంతే కష్టపడతాం. కానీ పారితోషికంలో ఆ సమానత్వం ఎక్కడా కనిపించదు. హీరోలతో పోలిస్తే మాకు పదో వంతు కూడా రాదు. ఇంకా సెట్‌లో చాలా సార్లు మేము ఎదురుచూస్తుంటే, షూట్ ఎప్పుడు మొదలు కావాలో హీరోనే నిర్ణయిస్తాడు. కానీ హాలీవుడ్‌లో ఇలాంటి సిస్టమ్ లేదు’ అని ఆమె చెప్పింది. అదే ఇంటర్వ్యూలో ప్రియాంక తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకుంది..
‘నేను రంగులో కాస్త డార్క్‌గా ఉండటం వల్ల ఆరంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. రంగు తక్కువ అని, స్క్రీన్‌పై బాగోనని కామెంట్స్ వచ్చేవి. ఆ కారణంగా చాలా ఆఫర్లు చేజారాయి. అప్పుడు తోటి నటీమణుల కంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది’ అని ఆమె తెలిపింది. ప్రియాంక హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడ సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తారని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. అభిమానులు, ఫెమినిస్ట్ గ్రూపులు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.