Naslen: ‘ప్రేమలు’ సినిమా చూసిన ఎవరైనా సరే అందులో సచిన్ పాత్రను అంత తేలిగ్గా మర్చిపోలేరు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూనే యూత్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్నాడు మాలీవుడ్ యంగ్ హీరో నస్లేన్. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, చిన్న చిన్న సీన్లలో కనిపించే స్థాయి నుంచి సొంత కష్టంతో హీరోగా ఎదిగాడు. సరిగ్గా ఇప్పుడిప్పుడే మంచి మార్కెట్ దక్కుతున్న టైమ్‌లో, నస్లేన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
లవర్ బాయ్‌గా వరుస అవకాశాలు వస్తున్న టైమ్‌లో, ఏకంగా విలన్ అవతారం ఎత్తేందుకు రెడీ అయిపోయాడు. తమిళంలో హీరో సూర్య, డైరెక్టర్ జీతూ మాధవన్ కాంబినేషన్‌లో వస్తున్న సీన్ సినిమాలో నస్లేన్ ఒక సైకో కిల్లర్‌గా కనిపించబోతున్నాడు. నజ్రియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 6న థియేటర్లలోకి రానుంది. తమిళంలో మొదటి సినిమాతోనే అడుగుపెడుతూ, ఇలాంటి భయపెట్టే పాత్రను ఎంచుకోవడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. కేవలం లవర్ బాయ్ పాత్రలకే పరిమితం కాకుండా, తనలో అన్ని రకాల నటన ఉందని చూపించడానికే ఈ రోల్‌కు ఓకే చెప్పాడని అంటున్నారు. దీనికితోడు రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ వచ్చిన రెండు వారాల గ్యాప్‌లోనే ‘బ్యాచిలర్ పార్టీ 2’ అనే మల్టీస్టారర్ సినిమాతో మలయాళంలో కూడా మరోసారి పలకరించబోతున్నాడు నస్లేన్.
నటుడిగా ప్రయోగాలు చేయడం మంచిదే అయినా, కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో ఇలాంటి రూట్ ఎంచుకోవడం పెద్ద రిస్క్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి నెగిటివ్ రోల్స్‌లో క్లిక్ అయితే, దర్శకులు వరుసగా అలాంటి విలన్ వేషాలే ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రేపు హీరోగా తనకున్న మార్కెట్ దెబ్బతినే ఛాన్స్ కూడా లేకపోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి విలన్ వేషం ఈ ఒక్క సినిమాతోనే ఆపేస్తాడా, లేక ఇలాంటి పాత్రల్లోనే కొనసాగుతాడా అనేది చూడాలి.

