బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు రోజురోజుకూ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ కేసులో పలువురు ప్రముఖులు ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న హీరో విజయ్ దేవరకొండ మరియు యూట్యూబర్, నటి సిరి హనుమంతు సిట్ ముందు హాజరయ్యారు. విజయ్ దేవరకొండను అధికారులు సుమారు రెండు గంటలపాటు, సిరి హనుమంతును నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఇద్దరినీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం తీసుకున్న మొత్తాల గురించి, ఆ డబ్బు ఎలా అందిందో, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ సంస్థలతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారో వివరంగా అడిగారు.
Also Read : Sobhita Dhulipala : ప్రతి అమ్మాయి తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ ‘బ్యాడ్ గర్ల్’ను ప్రశంసించిన శోభితా
సిట్ అధికారులు ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఖాతాలో జమ అయింది, దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఆయన కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసిన వారిలో ఒకరని సమాచారం. ఆయన్ను కూడా ఈ రోజు సిట్ అధికారులు విచారించి, సంబంధిత వివరాలు అడగనున్నారు. తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని, ప్రముఖుల ప్రమోషన్‌ల వెనుక ఉన్న అసలు ముఠాలను బయటకు తీసే దిశగా దర్యాప్తు కొనసాగిస్తోంది.
