Fauzi 3-Minute Teaser on Prabhas Birthday: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది పుట్టినరోజు ఆయన అభిమానులకు మరింత స్పెషల్‌గా మారబోతుందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. డార్లింగ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ నుంచి ఏకంగా మూడు నిమిషాల టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. చారిత్రక నేపథ్యంతో పాటు భారీ యాక్షన్ అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. పోస్టర్‌లో ప్రభాస్ లుక్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ నుంచి మూడు నిమిషాల నిడివి ఉన్న టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ టీజర్ అభిమానులకు భారీ ట్రీట్‌గా ఉండబోతుందట. దీంతో ప్రభాస్ అభిమానులు అధికారిక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీతో పాటు ఆయన నటిస్తున్న మరో రెండు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’కు సంబంధించి ఏదైనా కీలక అప్డేట్ రావచ్చనే అంచనాలు ఉన్నాయి. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కల్కి 2’పై కూడా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ ప్రభాస్‌తో అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని నాగ్ అశ్విన్ గతంలో వెల్లడించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ టీజర్‌తో పాటు స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు వస్తే అభిమానులకు నిజంగానే పండగే.

