Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!

Prabhas Fans

Prabhas Fans

ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తానని అభిమానులకు మాటిచ్చిన ‘డార్లింగ్’ ప్రభాస్.. ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. గతేడాది ప్రభాస్ నుంచి కొత్త సినిమా విడుదల కాలేదు. ఈ ఏడాది రెండు సినిమాలు వస్తాయని అభిమానులు ఆశించినా.. ‘రాజా సాబ్’తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ తన అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వనున్నారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా విడుదల వాయిదా పడటంతో వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ కూడా విడుదల తేదీ వాయిదా పడనుంది. ఫౌజీ విడుదల నేపథ్యంలో స్పిరిట్‌ను 2027 దీపావళికి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలైతే ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటారు.

ప్రభాస్ సినిమాల జాబితాలో యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ – పార్ట్ 1’ కూడా చేరింది. ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన బాహుబలి ప్రపంచాన్ని యానిమేషన్ రూపంలో ప్రేక్షకులకు అందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫౌజీ, స్పిరిట్‌తో పాటు బాహుబలి యానిమేషన్ చిత్రం కూడా విడుదలైతే.. 2027లో ప్రభాస్ నుంచి అభిమానులకు మూడు సినిమాల ట్రిపుల్ ట్రీట్ దక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2’ సెట్స్‌పై ఉంది. మరోవైపు ‘సలార్ 2’ షూటింగ్ వచ్చే ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల వెల్లడించారు. ఈ రెండు సినిమాలు కూడా ప్రభాస్ కెరీర్‌లో కీలకమైన ప్రాజెక్టులుగా నిలవనున్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్టులపై ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. బాహుబలి 2, కల్కి 2898 ఏడీ సినిమాలతో వెయ్యి కోట్ల వసూళ్లను సాధించిన ప్రభాస్.. మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది విడుదల కానున్న సినిమాల్లో ఏదైనా మరో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా?.. ప్రభాస్ హ్యాట్రిక్ వెయ్యి కోట్ల సినిమాల రికార్డును అందుకుంటాడా? అన్నది చూడాలి.