Poojitha Ponnada: AK47లో ఫుల్ లెంగ్త్ రోల్ అని పిలిచి.. సైలెంట్‌గా వేరే హీరోయిన్‌ను పెట్టేశారు!

Poojitha Ponnada

Poojitha Ponnada

Poojitha Ponnada: సినిమాల్లో పాత్రల మార్పులు, హీరోయిన్ల రీప్లేస్‌మెంట్లు కొత్తేమీ కాకపోయినా.. కనీస సమాచారం లేకుండా పక్కన పెట్టడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘#AK47’ సినిమా విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుగు నటి పూజిత పొన్నాడ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “సాధారణంగా ఏ నటికైనా సినిమా ఆద్యంతం కనిపించే ‘ఫుల్ లెంగ్త్ రోల్’ దొరకడం కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతుంది. ‘#AK47’ మేకర్స్ కూడా సరిగ్గా ఇదే మాట చెప్పి నన్ను సంప్రదించారు. సినిమాలో నాది చాలా ముఖ్యమైన, పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర అని చెప్పడంతో ఎంతో ఉత్సాహంగా ఆ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాను. అనుకున్నట్లుగానే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. సెట్స్‌లోకి అడుగుపెట్టి, దాదాపు ఐదు రోజుల పాటు నా పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నాను” అని వెల్లడించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. “ఈ ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత, రెండో షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూడటం మొదలుపెట్టాను. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలుగా మారాయి. కానీ మేకర్స్ నుంచి మాత్రం నాకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. షెడ్యూల్ గ్యాప్ వల్లే ఆలస్యమవుతోందని అనుకున్నాను. అయితే సరిగ్గా మూడు నెలల తర్వాత నాకు దిమ్మతిరిగే నిజం తెలిసింది. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా, కనీస నోటీసు ఇవ్వకుండా నా స్థానంలో మరో నటిని తీసుకున్నారని తెలిసి షాకయ్యాను” అని చెప్పుకొచ్చింది.

కథలో మార్పుల వల్లనో, ఇతర కారణాల వల్లనో నటీనటులను మార్చాల్సి వస్తే.. ముందుగా ఆ విషయాన్ని సదరు ఆర్టిస్ట్‌కు తెలియజేయడం ఇండస్ట్రీలో కనీస సంప్రదాయం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. ఐదు రోజులు పని చేయించుకున్న తర్వాత, ‘మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నాం’ అని చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా సైలెంట్‌గా వేరే హీరోయిన్‌ను పెట్టేశారు. మూడు నెలల పాటు ఆ సినిమాపై ఆశలు పెట్టుకుని ఉన్న నాకు కనీస సమాచారం ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించింది అంటూ పూజిత పొన్నాడ తన ఆవేదనను వ్యక్తం చేశారు. పూజిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బయటకు ఎంతో హుందాగా కనిపించే సినీ పరిశ్రమలో, ఆర్టిస్టుల పట్ల వ్యవహరించే తీరు ఇలా ఉంటుందా అంటూ నెటిజన్లు సైతం ‘#AK47’ టీమ్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.