ఓటీటీలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ‘మా ఊరి పొలిమేర’. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ‘పొలిమేర 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చేతబడి, క్షుద్ర పూజలు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. అయితే ఈసారి రేంజ్ మారింది.. ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ‘పొలిమేర 3’ ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు. ఈ చీకటి ప్రపంచంలోకి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాను దించుతూ, దీపావళి కానుకగా ఆయన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను వదిలారు. గ్లింప్స్ చూస్తుంటే ఈసారి కొమరయ్య (సత్యం రాజేశ్) క్షుద్రపూజలకు అడ్డుకట్ట వేసే యోధుడి పాత్రలో అర్జున్ సర్జా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాడుబడిన ఆలయంలోని చీకటి ప్రదేశాలు, అమావాస్య వాతావరణం, విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలతో పాటు అనంత పద్మనాభస్వామి దర్శనంతో గ్లింప్స్ అద్భుతంగా, ఆధ్యాత్మికంగా మొదలైంది. ఒకవైపు కొమరయ్య తనదైన శైలిలో భయపెట్టే క్షుద్రపూజలు చేస్తుండగా.. చేతిలో పదునైన కత్తి పట్టుకుని, గంభీరమైన యోధుడి వేషధారణలో అర్జున్ సర్జా ‘విరావి’ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించిన తీరు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఆయన లుక్, హావభావాలు సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేశాయి.
డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్) సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వంశీ నందిపాటి, భరత్ నారంగ్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తొలి రెండు భాగాలతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన ఈ సిరీస్‌ను, ఇప్పుడు ఏకంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, కృష్ణ ప్రసాద్ నేపథ్య సంగీతం గ్లింప్స్‌లోని చీకటి ప్రపంచాన్ని మరింత భయంకరంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దాయి. రీసెంట్గా ‘బ్లాస్ట్’ మూవీతో మెప్పించిన అర్జున్ సర్జా.. ఇప్పుడు ఇలాంటి ఒక మిస్టిక్ థ్రిల్లర్‌లో భాగం కావడం సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. ఈ ఫ్రాంచైజీలో తమ పాత పాత్రలతోనే సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఏదేమైనా ఈసారి ‘పొలిమేర 3’లో కొమరయ్య వెర్సెస్ విరావి మధ్య పోరు వెండితెరపై ఒక రేంజ్లో ఉండబోతోందని ఈ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.

