ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను సెట్స్ పై ఉంచారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీనిని ఎ.ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే సమయంలో హారిక అండ్ హాసిని సంస్థ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లోనూ పవన్ నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… ఇందులో టైటిల్ పాత్రను పవన్ తో పాటు రానా సైతం షేర్ చేసుకుంటున్నాడు. ముక్కుసూటిగా పోయే పోలీస్ ఆఫీసర్ గా పవన్ నటిస్తుంటే, ముక్కుమీద కోపం ఉండే మాజీ మిలటరీ ఆఫీసర్ పాత్రను రానా చేస్తున్నాడు. ఒకానొక సందర్భంగా ఊహించని విధంగా వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగి వైరం దావానలంగా వీరిద్దరిని దహించే పరిస్థితి వస్తుంది. అయితే… టగ్ ఆఫ్ వార్ గా సాగే ఈ పాత్రలు మరింత బలంగా ఉండాలని ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను అదనంగా తెలుగు రీమేక్ లో యాడ్ చేశారట. ఇటీవలే దాని చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది. కానీ ఇటీవల ‘పింక్’ రీమేక్ గా వచ్చిన ‘వకీల్ సాబ్’లోనూ శ్రుతీ హాసన్ ఎపిసోడ్ ను అదనంగా జత చేశారు. కానీ దాని వల్ల సినిమాకు ఏ రకమైన మేలు జరగలేదనే విమర్శ వచ్చింది. బహుశా దానిని కూడా దృష్టి పెట్టుకునే సాగర్ చంద్ర బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఈ తాజా చిత్రం కోసం రాసి ఉంటాడని అభిమానులు ఆశపడుతున్నారు.
పవన్ – రానా చిత్రానికి అదనపు హంగులు!
