Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్‌లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి

Partition1947

Partition1947

Partition 1947: చాలా ఏళ్ల తర్వాత సన్నీ డియోల్, ప్రీతి జింటా కలిసి వెండితెరపై కనిపించబోతుండటంతో ‘పార్టిషన్ 1947’ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కూడా ఈ ఇద్దరూ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో లక్నోలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్‌లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానుల భారీ రద్దీ మధ్య ఒక యువకుడికి  గాయాలు కావడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

సన్నీ డియోల్, ప్రీతి జింటా సినిమా ప్రమోషన్ కోసం లక్నోలోని కృష్ణ నగర్ ప్రాంతంలోని ఫీనిక్స్ మాల్‌కు శుక్రవారం వెళ్లారు. తమ అభిమాన నటీనటులను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఫొటోలు తీసుకుంటుండగా ఒక వ్యక్తి కాలికి గాయం కావడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. తొలుత సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రమాద తీవ్రతపై రకరకాల ప్రచారం జరిగింది.

అయితే లక్నో పోలీసులు దీనిపై వెంటనే స్పష్టత ఇచ్చారు. ఫీనిక్స్ మాల్‌లో ఫొటోలు తీసుకుంటున్న సమయంలో వ్యక్తి కాలికి స్వల్ప గాయం మాత్రమే అయిందని పోలీసులు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారని, ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో శాంతిభద్రతలు పూర్తిగా సాధారణంగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే లక్నో పర్యటన సందర్భంగా సన్నీ డియోల్, ప్రీతి జింటా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిశారు. నిన్న ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఇద్దరు నటులతో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. అనంతరం వారికి దేవుళ్లు, దేవతల విగ్రహాలను బహూకరించి ఫొటోలకు పోజులిచ్చారు.

సన్నీ డియోల్, ప్రీతి జింటా కాంబినేషన్‌కు కూడా ‘పార్టిషన్ 1947’ ప్రత్యేకమైనదే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఇద్దరు నటులు మరోసారి కలిసి తెరపై కనిపించనున్నారు. గతంలో 2018లో విడుదలైన ‘భయ్యాజీ సూపర్‌హిట్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, సన్నీ, ప్రీతి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇప్పుడు ‘పార్టిషన్ 1947’తో ఈ హిట్ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిస్టారికల్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే బజ్ పెరిగింది. ఆగస్టు 14న ‘పార్టిషన్ 1947’ థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్ సమయంలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు స్పష్టత ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు చాలా కాలం తర్వాత సన్నీ, ప్రీతి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మూవీని చూసేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.