Site icon NTV Telugu

Park Hyatt : పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం: ఓదెల 2 ఈవెంట్‌కి ఇబ్బందేం లేదు !

Park Hyatt Hotel

Park Hyatt Hotel

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ప్రతిష్టాత్మక పార్క్ హయత్ హోటల్‌లో సోమవారం (ఏప్రిల్ 14, 2025) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టమైన పొగలు హోటల్‌ను ఆవరించాయి. ఈ ఘటనతో హోటల్‌లో ఉన్నవారిలో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ హోటల్‌లో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ టీమ్ ఆటగాళ్లు బస చేస్తున్నారనే విషయం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యతను జోడించింది. అయితే, అగ్నిప్రమాదం సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం. SRH టీమ్ ఆటగాళ్లు ఈ ఘటన తర్వాత కూడా తమ షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నారు.

Tu Mera Lover: చక్రి ఏఐ వాయిస్ తో రవితేజ సాంగ్ .. భలే ఉందే!

ఓదెల 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ఉంటుందా? ఉండదా?
అదే హోటల్‌లో సోమవారం సాయంత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓదెల 2’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అశోక్ తేజ దర్శకత్వంలో, సంపత్ నంది రచనలో తెరకెక్కిన ఈ సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ ఏప్రిల్ 17, 2025న విడుదల కానుంది. తమన్నా శివశక్తి అనే నాగసాధ్వి పాత్రలో కనిపించనుంది, ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం హోటల్‌లో భారీ ఏర్పాట్లు జరిగాయి, మరియు అగ్నిప్రమాదం ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించలేదని నిర్వాహకులు తెలిపారు. ఎందుకంటే ఈ ప్రమాదం ఉదయమే జరిగిందని, మీడియాకు సమాచారం మధ్యాహ్నం తరువాత జరిగిందని వెల్లడించారు. ఎలాంటి ఢోకా లేకుండా సాయంత్రం ఈవెంట్ జరగనుందని వెల్లడించారు.

Exit mobile version