Panja Re Release: కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా, కాలం గడిచేకొద్దీ వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమాల్లో ‘పంజా’ కూడా ఒకటి. 2011లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత అదే సినిమా మరోసారి థియేటర్లలోకి రావడంతో అభిమానుల సందడి మామూలుగా లేదు.
ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పంజా’ మూవీని 4Kలో రీమాస్టర్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ మంగళవారం రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు నిర్వహించడంతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్‌ను జై పాత్రలో మరోసారి పెద్ద తెరపై చూసే అవకాశం రావడంతో అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు.
అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే ‘పంజా’ రీ రిలీజ్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే సమయానికి అన్ని ప్రాంతాలను కలిపి రూ.3 కోట్లకు పైగా ప్రీ సేల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. రీ రిలీజ్ సినిమాలకు ఈ రెస్పాన్స్ రావడం అరుదుని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించే సినిమాగా ‘పంజా’ నిలిచే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేకత పవన్ కళ్యాణ్ అభిమానుల సెలబ్రేషన్స్. ఆయన బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద అభిమానులు భారీగా సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థియేటర్ల వద్ద బ్యానర్లు, కటౌట్లు, బాణాసంచా, డ్యాన్సులతో అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమా కథ కంటే ముందే పవన్ కళ్యాణ్ స్క్రీన్‌పై కనిపించే ప్రతి సన్నివేశానికి అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ మరోసారి ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను చూపిస్తోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటు అడివి శేష్, జాకీ ష్రాఫ్, సారా జేన్ డియాస్ కీలక పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
రీ రిలీజ్ సినిమాల విషయంలో కథ కొత్తది కాకపోయినా, అభిమానులకు తమ అభిమాన హీరోను మరోసారి థియేటర్లలో చూసేందుకు పరుగులు పెడుతుంటారు. అదే ఇప్పుడు ‘పంజా’ విషయంలోనూ కనిపిస్తోంది. 15 ఏళ్ల క్రితం థియేటర్లలో చూసిన పవన్ కళ్యాణ్‌ను ఇప్పుడు 4K క్వాలిటీలో మరింత గ్రాండ్‌గా చూడటానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ.3 కోట్లకు పైగా ప్రీ సేల్స్ రావడం, థియేటర్ల వద్ద జరుగుతున్న భారీ సెలబ్రేషన్స్ చూస్తే ఈ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

