NTV Telugu Site icon

2021 ఆస్కార్ హైలైట్స్

Oscars 2021 Highlights

93వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లో ముగిసాయి. కరోనా పాండమిక్ లోనూ ఈ వేడుకలు ఆసక్తికరంగా జరిగాయి. అసలు నామినేషన్స్ ప్రక్రియనే వైవిధ్యంగా జరగటం విశేషం. ఈ ఏడాది ‘నోమాడ్లాండ్’ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులను గెలుపొందింది. ఈ ఏడాది అత్యధిక అవార్డులను గెలుచుకున్న సినిమా ఇదే. ఇక 78వ ఆస్కార్ అవార్డుల తర్వాత నాలుగు అంతకు మించి ఏ సినిమా అస్కార్ అవార్డులను గెలుపొందక పోవడం గమనార్హం. ఇక ‘నోమాడ్లాండ్’ దర్శకురాలు చోలే జావో ఆస్కార్ అవార్డుల చరిత్రలోనే ఉత్తమ దర్శకత్వం విభాగంలో గెలుపొందిన రెండవ మహిళ కావటం విశేషం. అయితే తొలి శ్వేతేతర జాతీయురాలు మాత్రం ఈమెనే కావటం మరీ విశేషం. ఇక సర్ ఆంటోని హాప్కిన్స్ ‘ఫాదర్’ సినిమాకు ఉత్తమ నటుడుగా అవార్డు దక్కించుకున్నారు. అస్కార్ చరిత్రలో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న అతి పెద్ద వయసు (83 సంవత్సరాలు) ఉన్న వ్యక్తి ఈయనే. అయితే ఆంటోని హాప్కిన్స్ గతంలో ‘ద సైలెన్స్ ఆప్ ద లాంబ్స్’ సినిమాకు కూడా ఉత్తమనటుడు అవార్డు పొందారు. నిజానికి ఈ సంవత్సరం ‘బ్లాక్ బాటమ్’లో నటించిన ‘చాద్విక్ బోస్ మాన్’ కి ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని భావించారు. అందరికీ షాక్ ఇస్తూ ఆంటోనీ హాప్కిన్స్ అవార్డు ఎగరేసుకుపోయాడు. ఈ ఏడాది మొత్తం 8 సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడ్డాయి. వాటిలో 7 సినిమాలకు ఏదో కేటగిరిలో అవార్డు దక్కటం విశేషం. ఈ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో డెన్మార్క్ కి చెందిన థామస్ వింటర్ బెర్గ్ సినిమా ‘అనదర్ రౌండ్’ అవార్డ్ దక్కించుకుంది. క్రిష్టోఫర్ నోలన్ తీసిన ‘టెనెట్’ సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డ్ లభించింది. ఇతర విభాగాల్లో ఈ సినిమాకు చుక్కెదురైంది. అటు థియేటర్లలోనే కాదు ఇటు అవార్డుల లోనూ ‘టెనెట్’ సత్తా చాటలేకపోయిందన్నమాట. ఇక ‘మంక్, సోల్, జుడాస్, బ్లాక్ మెస్సయ్య, ద ఫాదర్, బ్లాక్ బాటమ్, సౌండ్ ఆప్‌ మెటల్’ వంటి పలు సినిమాలు రెండేసి అస్కార్స్ ను సాధించాయి. మన ఇండియన్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అత్తయ్యలను ఆస్కార్ మెమోరియమ్ గుర్తు చేసుకోవడం గమనార్హం.