O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!

O Andala Rakshasi Hero Shiraz Mehdi

O Andala Rakshasi Hero Shiraz Mehdi

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పట్ల వివక్ష కొనసాగుతోందని ‘ఓ అందాల రాక్షసి’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులకు థియేటర్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని.. తమని తొక్కిపెడితే ఊరుకోమన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షిరాజ్ మెహదీ మాట్లాడుతూ.. చిన్న సినిమాల సమస్యలను, థియేటర్ల కేటాయింపులో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.

‘అందరి సహకారంతో, మంచి సాంకేతిక నిపుణులతో ఓ అందాల రాక్షసి చిత్రాన్ని రూపొందించాము. మా సినిమాను సరైన స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తే రికార్డులు సృష్టించే సత్తా ఉంది. చిన్న సినిమాలకు థియేటర్లు దక్కకపోవడంపై ఇప్పటికే 40కి పైగా ప్రెస్ మీట్లు, 50 ఇంటర్వ్యూలు ఇచ్చాను. సెన్సార్ నిబంధనలు, ఏడీసీసీ ప్రాసెస్ పేరుతో చిన్న నిర్మాతల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. క్యూబ్, యుఎఫ్ఓ వంటి డిజిటల్ ప్రొవైడర్లు వారానికి సుమారు రూ.2,000 ఖర్చుతో పూర్తయ్యే పనులకు ఒక్కో థియేటర్ నుంచి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల చిన్న నిర్మాతలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు’ అని హీరో షిరాజ్ మెహదీ చెప్పారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చిన్న నిర్మాతలు, దర్శకులకు అండగా నిలవడం లేదని షిరాజ్ మెహదీ విమర్శించారు. చిన్న చిత్రాల సమస్యలను పరిష్కరించాల్సిన వ్యవస్థే తమపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆరోపించారు. ఐనాక్స్, పీవీఆర్, ఏషియన్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు తొలుత తమ సినిమాకు థియేటర్లు ఇస్తామని చెప్పి.. చివర్లో వెనక్కి తగ్గాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన నోటీసులు ఇచ్చామని, హైకోర్టు నుంచి సమన్లు కూడా వెళ్లాయని తెలిపారు. సినిమా పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమాలకు తగిన రక్షణ కల్పించడంతో పాటు.. సినీ పరిశ్రమపై ఆధారపడే డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టుల సంక్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ వంటి చర్యలు తీసుకోవాలని హీరో కోరారు.