Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

Nithiin Holds Umbrella For Nani 20 Year Friendship Story

Nithiin Holds Umbrella For Nani 20 Year Friendship Story

Nani Nithiin Friendship: ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ల కిందట జరిగిన ఒక సరదా సంఘటన, ఇద్దరు స్టార్ హీరోల మధ్య చెక్కుచెదరని స్నేహానికి పునాది వేసింది. ‘అలియాస్ రుక్మిణి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న నితిన్, నాని.. అప్పట్లో ఎవరికీ తెలియని ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ను బయటపెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాని చేతిలో క్లాప్ బోర్డ్ పట్టుకుని నడుస్తుంటే, హీరో నితిన్ స్వయంగా ఆయనకు గొడుగు పట్టుకుని స్టేజ్ మీదికి రావడం ఈవెంట్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.

ఈ ఇద్దరు స్టార్స్ ఒకరినొకరు సరదాగా ‘బాబు’ అని పిలుచుకోవడం వెనుక 20 ఏళ్ల నాటి కథ ఉంది. 2005లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు నితిన్ హీరో. అప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టిన నాని, ఆ చిత్రానికి క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఇద్దరూ దాదాపు ఒకే వయసు వాళ్లు కావడంతో, సెట్‌లో హీరోలను ‘బాబు’ అని పిలవాలనే ఇండస్ట్రీ రూల్ తెలియక నాని నేరుగా వెళ్లి “నితిన్, షాట్ రెడీ” అని పిలిచేవారట.

అది చూసిన ప్రొడక్షన్ మేనేజర్‌కు కోపం నషాళానికి అంటింది. ఒక కొత్త కుర్రాడు హీరోతో అంత చనువుగా మాట్లాడటం చూసి నానిని పక్కకు పిలిచి గట్టిగా క్లాస్ పీకారట. “ఏంటి బాబుని పట్టుకొని నితిన్ అని పిలుస్తావు? బాబు అని పిలు” అని గదమాయించారట. దాంతో తర్వాతి షాట్‌కు పిలవడానికి వెళ్లిన నాని “బాబు, షాట్ రెడీ” అనగానే నితిన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పిలుపు ఎందుకు మారిందని నిలదీసినా నాని చెప్పకపోవడంతో.. “నువ్వు నన్ను నితిన్ అని పిలిచేదాకా నేను షాట్‌కు రాను” అని నితిన్ సెట్‌లో భీష్మించుకుని కూర్చున్నారట.

చివరికి మేనేజర్ తిట్టిన విషయం నాని చెప్పడంతో, నితిన్‌కు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. “ఇప్పుడు ఆ మేనేజర్‌కు ఇంకా ఒళ్లు మండాలంటే ఏం చేయాలి?” అని నితిన్ అడగగా.. మనిద్దరం భుజంపై చేయి వేసుకుని సెట్‌లోకి నడుద్దామని నాని అన్నారు. అంతటితో ఆగకుండా “నీ గొడుగు నాకు పట్టాలి” అని నాని సరదాగా అనగానే, నితిన్ ఏమాత్రం ఆలోచించకుండా గొడుగు అందుకున్నారట. అప్పటికే యూత్‌లో క్రేజీ హీరోగా ఉన్న నితిన్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌కు గొడుగు పట్టుకుని రాఘవేంద్రరావు సెట్‌లోకి అడుగుపెట్టడం చూసి యూనిట్ మొత్తం అవాక్కయిందట.

మొన్న ‘అలియాస్ రుక్మిణి’ గ్లిమ్స్ షూటింగ్ రోజు కూడా వర్షం పడుతుండగా, నితిన్ మళ్లీ నానికి గొడుగు పట్టి ఆ నాటి జ్ఞాపకాన్ని గుర్తుచేశారు. ఇక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆ ఫొటోలను స్క్రీన్‌పై ప్రదర్శించిన తర్వాత, వీరిద్దరూ కలిసి అక్కడికక్కడే ఆ సీన్‌ను రీక్రియేట్ చేశారు. క్లాప్ బోర్డ్ పట్టుకున్న నానికి నితిన్ నల్ల గొడుగు పట్టుకుని స్టేజ్ మీదికి నడుచుకుంటూ రావడంతో ఆడిటోరియం మొత్తం కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలై నేడు స్టార్ హీరోగా, నిర్మాతగా ఎదిగిన నాని ప్రయాణానికి, ఇన్నేళ్లయినా మారని వీరి స్నేహానికి ఈ మూమెంట్ నిదర్శనంగా నిలిచిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.