Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి

Nikhil Siddhartha

Nikhil Siddhartha

Nikhil Siddhartha: వెండితెరపై హీరోలు చేసే ప్రతి పనిని యువత గుడ్డిగా అనుకరిస్తుంటుంది. అలాంటిది సినిమాల్లో మందు, సిగరెట్, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లను హీరోయిజంలా చూపించడం ఎంతవరకు కరెక్ట్? సరిగ్గా ఇదే ప్రశ్నను లేవనెత్తుతూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీరుపై యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కుండబద్దలు కొట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘నశా ముక్త్ భారత్ యాత్ర’ వేదికపై మాట్లాడిన నిఖిల్, సినిమాల్లో ఇలాంటి వ్యసనాలను ప్రోత్సహించడం తక్షణమే ఆగిపోవాలని పిలుపునిచ్చారు.

తెలుగు సినిమాల్లో కచ్చితంగా మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని నిఖిల్ అభిప్రాయపడ్డారు. డ్రగ్స్, మద్యం, స్మోకింగ్ వంటి వాటిని ప్రోత్సహించేలా సన్నివేశాలు తీయడం మానుకోవాలని, సమాజానికి, యువతకు ఆదర్శంగా నిలిచే చిత్రాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. తాను కూడా మొదటి నుంచీ ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నానని చెప్పారు. ఇప్పటివరకు 21 సినిమాల్లో నటించానని, కానీ ఏ ఒక్క సినిమాలోనూ డ్రగ్స్ తీసుకునే పాత్ర చేయలేదని గర్వంగా ప్రకటించారు. భవిష్యత్తులోనూ అలాంటి పాత్రల జోలికి అస్సలు వెళ్లనని, తన చిత్రాలన్నీ ఎప్పుడూ మంచి సందేశాన్ని ఇచ్చేలాగే ఉంటాయని నిఖిల్ స్పష్టం చేశారు.

డ్రగ్స్ మహమ్మారిపై తాను ఇంత గట్టిగా మాట్లాడటానికి కారణం తన వ్యక్తిగత అనుభవమేనని నిఖిల్ వెల్లడించారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో తన స్నేహితుల్లో కొందరు డ్రగ్స్ అలవాటు చేసుకోమని తనను కూడా ప్రోత్సహించారని నాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ రోజు కనుక తాను బలహీనపడి వాళ్ల ఉచ్చులో పడి ఉంటే, ‘హ్యాపీ డేస్’ లాంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమయ్యేవాడినే కాదని అన్నారు. ఇండస్ట్రీలో ఇన్ని ఏళ్లుగా నిలదొక్కుకుని 21 సినిమాలు పూర్తి చేయగలిగానంటే, అందుకు కేవలం తాను పాటించిన క్రమశిక్షణే కారణమని నిఖిల్ వివరించారు. ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.