ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం ప్రధాన జంటగా, విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మిత్ర మండలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిహారిక ఎన్ ఎం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది.
‘మిత్ర మండలి’ కథ మొదట విన్నదేనా? ‘పెరుసు’ కన్నా ముందు సైన్ చేసారా?
అవును, నేను మొదట విన్న కథ ‘మిత్ర మండలి’దే. అయితే, షూటింగ్ ఆలస్యమవడంతో నా తమిళ చిత్రం ‘పెరుసు’ ముందే విడుదలైంది. ఈ సినిమాలో ఉన్న పెద్ద తారాగణం కారణంగా అందరి డేట్స్ సెట్ చేయడంలో కొంత సమయం పట్టింది. ఇప్పుడు మాత్రం అన్ని పనులు పూర్తయ్యాయి — అక్టోబర్ 16న మా సినిమా థియేటర్లలోకి వస్తోంది.
ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.
ఇందులో నేను ఓ మృదువైన, సింపుల్ గర్ల్ పాత్రలో కనిపిస్తాను. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నా రియల్ లైఫ్‌లో ఉన్నట్టే ఈ రోల్ కూడా నాకు బాగా కంఫర్ట్‌గా అనిపించింది. సినిమాల్లో నటించడం నాకు కొత్త అనుభవం — చాలా ఎంజాయ్ చేశాను.
ప్రియదర్శితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
ప్రియదర్శి చాలా హ్యుమన్, సింపుల్ పర్సన్. అద్భుతమైన నటుడు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆయన నటించిన కోర్ట్ సినిమా భారీ హిట్ అయింది. అయినా ఆయనలో అహంకారం లేదు. సక్సెస్ వచ్చినా, హ్యూమిలిటీ అలాగే ఉంటుంది — అది నిజంగా ఇంప్రెస్ చేసింది.
మీకు వచ్చే ఆఫర్లు ఎక్కువగా కామెడీ జానర్‌లోనేనా?
అవును, ఎక్కువగా కామెడీ బేస్డ్ సినిమాలే వస్తున్నాయి. కానీ ఇకపై కాస్త వేరే కాన్సెప్ట్‌లు, ఎమోషనల్ సబ్జెక్ట్‌లు కూడా చేయాలని అనుకుంటున్నాను. కామెడీ అంటే నాకు ఇష్టం — ఆ ఉత్సాహం వల్లే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్ చేస్తుంటాను (నవ్వుతూ).
ఫెయిల్యూర్స్‌కి ఎలా రియాక్ట్ అవుతారు?
నిజంగా చెప్పాలంటే, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను బాధపడతాను. కానీ ఎక్కువసేపు ఆలోచించను — వెంటనే దాన్ని దాటుకుని ముందుకు సాగిపోతాను. పాజిటివ్‌గా ఉండటమే నాకు ఇష్టం.
టాలీవుడ్‌లో పని చేసిన అనుభవం ఎలా ఉంది?
తెలుగు ఇండస్ట్రీలో నాకు చాలా మంచి అనుభవం వచ్చింది. బయట ఉన్నవాళ్లు ఏం మాట్లాడుకున్నా, మనం మన హద్దుల్లో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడి దర్శకులు, నిర్మాతలు, టీమ్ అందరూ నాకు ఫ్యామిలీలా వ్యవహరించారు. తెరపై నా ఫ్యామిలీ కూడా సంతోషంగా చూడగలిగే పాత్రలే చేయాలని ఆశిస్తోంది.
‘మిత్ర మండలి’ గురించి ప్రేక్షకులు ఏమి ఆశించవచ్చు?
ఈ సినిమా పూర్తి స్థాయి ఫన్ ఎంటర్‌టైనర్. కథ, సన్నివేశాలు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. హాల్‌లోకి వచ్చే ప్రతి ఒక్కరినీ నవ్వించేలా మా టీమ్ కష్టపడి చేసింది. ప్రేక్షకులు సంతోషంగా, నవ్వుతూ బయటకు వస్తారని నమ్ముతున్నాను.
దర్శకుడు, నిర్మాతల గురించి చెప్పండి.
విజయేందర్ గారు, నిర్మాతల గారు నన్ను చాలా స్నేహపూర్వకంగా చూసుకున్నారు. మొదటి రోజునుంచి చివరి రోజు వరకు నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. టాలీవుడ్‌లో నాకు లభించిన ప్రేమ, ఆదరణ మర్చిపోలేను.
