1994 లోనే ‘ఓ చోక్రీ’ మూవీతో ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది నీనా గుప్తా. 62 సంవత్సరాల ఈ నటి ఇప్పుడు ‘సచ్ కహూ తో…’ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసేసింది. జూన్ 14న ఇది విడుదల కాబోతోంది. నీనా గుప్త తన బయోగ్రఫీలో ఏ యే అంశాలను పొందు పరిచి ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 1980లలో ఆమె సింగిల్ మదర్ గా మసాబా గుప్తాకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి తండ్రి క్రికెటర్ వివియన్ రిచర్డ్ అనే విషయాన్ని కొంతకాలం తర్వాత కానీ నీనాగుప్తా రివీల్ చేయలేదు. అప్పటికే అతనికి వివాహం కావడం కూడా ఓ కారణం. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో శిక్షణ పొందిన నీనా గుప్తా ఆ తర్వాత ముంబై చేరింది. సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించడంతో పాటు టీవీ సీరియల్స్ కూ దర్శకత్వం వహించింది. 2008లో వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్న నీనా గుప్తా ఈ ఆటో బయోగ్రఫీలో చాలా ఆసక్తికరమైన అంశాలను టచ్ చేసిందని అంటున్నారు. సినిమా రంగంలోని కాస్టింగ్ కౌచ్, ఫిల్మీ పాలిటిక్స్, గాడ్ ఫాదర్ లేకపోవడంతో కొత్త నటీనటులు పడే స్ట్రగుల్, తన సెకండ్ ఇన్నింగ్స్, స్టీరియోటైప్ పాత్ర నుండి బయటపడటానికి చేసిన కృషి… వీటన్నింటి గురించి నీనా గుప్తా ఈ పుస్తకంలో చర్చించిందట. విశేషం ఏమంటే… ఇప్పటికీ ఆమె చాలా ఉత్సాహంగా సినిమాలలో నటిస్తోంది. ఆ మధ్య వచ్చిన ‘బదాయ్ హో’ మూవీతో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. ‘సచ్ కహూ తో….’ అంటున్న నీనా గుప్తా నిజంగా ఎన్ని నిజాలు చెప్పిందో తెలియాలంటే.. జూన్ 14 వరకూ వేచి ఉండాల్సిందే!