స్టార్ హీరోయిన్ నయనతార తాజా చిత్రం ‘నెట్రికన్’ ఓటీటీ లో రిలీజ్ అయ్యే దాఖలాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి థియేట్రికల్ రిలీజ్ కోసమే ఈ మూవీని నిర్మాతలు ప్రొడ్యూస్ చేసినా, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టి పెట్టుకుని, మనసు మార్చుకున్నారని అంటున్నారు. అయితే విడుదలకు ముందే ‘నెట్రికన్’ మూవీ 20 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థిల్లర్ కు 2011లో వచ్చిన కొరియన్ మూవీ ‘బ్లైండ్’ స్ఫూర్తి. కళ్ళు కనిపించని ఓ యువతి తనలోని ఇతర శక్తులతో సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుందన్నదే ఈ చిత్ర కథ. మిలింద్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతారతో పాటు అజ్మల్ అమీర్, శరణ్, ఇందుజ, మణికందన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. విశేషం ఏమంటే… నయనతారను బేస్ చేసుకుని నిర్మాతలు దాదాపు 20 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ చేశారట. దాంతో తన స్టామినాను గుర్తించిన నయనతార రెమ్యూనరేషన్ ను దాదాపు రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార రూ. 5 నుండి 6 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. రజనీకాంత్ సరసన నటిస్తున్న ‘అన్నాత్తే’కు నయన్ 4.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందట. ఇక మీదట నయన్ ను హీరోయిన్ గా పెట్టుకోవాలంటే అక్షరాల రూ. 10 కోట్లు చెల్లించాల్సిందేనని అంటున్నారు. సౌతిండియాలో ఇంత భారీ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.