Site icon NTV Telugu

Nari Nari Naduma Murari: సంక్రాంతి 2026కి బ్లాక్‌బస్టర్ ఎండ్.. శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయి!

Nari Nari Naduma Murari

Nari Nari Naduma Murari

టాలీవుడ్ హీరో శర్వానంద్‌ ఎట్టకేలకు హిట్ కొట్టారు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శర్వా.. ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా బుధవారం (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి వసూళ్లు సాధిస్తోంది. మొత్తానికి ‘నారి నారి నడుమ మురారి’ సినిమా శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. సంక్రాంతి సీజన్‌లో ఆయనకు ఇది హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌గా (2016 ఎక్స్‌ప్రెస్ రాజా, 2017 శతమానం భవతి) మారింది.

సంక్రాంతి 2026 రేసులో చివరిగా ప్రకటించబడిన, చివరిగా విడుదలైన సినిమా ‘నారి నారి నడుమ మురారి’. విడుదలలో ఆలస్యమైనా.. బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం గట్టిగానే వచ్చింది. ఈ చిత్రంలో శర్వానంద్ నటన అద్భుతం. స్టైలిష్ అండ్ క్లాసీ క్యారెక్టర్‌లో ఆయన పూర్తిగా లీనమయ్యారు. శర్వా ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ టాప్ క్లాస్‌గా నిలిచాయి. చాలా కాలం తర్వాత శర్వానంద్‌ను ఫుల్ ఎనర్జీలో చూసామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం హిట్ మాత్రమే కాదు.. బ్లాక్‌బస్టర్ అని ఫాన్స్ అంటున్నారు.

Also Read: Mohammed Siraj Captain: కెప్టెన్‌గా మహ్మద్‌ సిరాజ్‌!

దర్శకుడు రామ్‌ అబ్బరాజు సినిమాను వినోదాత్మకంగా మలిచిన తీరు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కథను నడిపిన విధానం సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. ఇద్దరు కథానాయికలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య మధ్య శర్వానంద్ పాత్రను ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేయడం కూడా సినిమాకు ప్లస్ అయింది. కామెడీ విషయానికి వస్తే.. నరేష్ వీకే, సత్య కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. ఆసుపత్రి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ఎక్కడా డబుల్ మీనింగ్‌లు లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్‌తో కలిసి చూడదగిన ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. సినిమాలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి స్పందన వస్తోంది. టెక్నికల్ అంశాల్లోనూ సినిమా మెప్పించింది. ఈ విజయంతో శర్వానంద్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Exit mobile version