The Paradise: టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలు చేస్తూ తన మార్కెట్‌ను క్రమంగా విస్తరించుకుంటున్న న్యాచురల్ స్టార్ నాని, ఈసారి తన కెరీర్‌లోనే ఊహించని భారీ రిస్క్‌కి తెరలేపారు. గతంలో ‘దసరా’ సినిమాతో రిస్క్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి మరోసారి జతకట్టారు. వీరిద్దరి కలయికలో రూపొందిన మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ది పారడైజ్’ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. నాని కెరీర్‌లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం, ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. మూడేళ్ల క్రితం వరకు నాని మార్కెట్ పరిధి రూ.50 కోట్ల షేర్, రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును తాకలేదు. కానీ ‘దసరా’ మూవీతో ఫస్ట్ టైం ఆ పరిమితులను చెరిపివేశారు. ఆ సినిమాను రూ.50 కోట్లకు బిజినెస్ చేస్తే, అనూహ్యంగా రూ. 65 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఆ సక్సెస్ ఇచ్చిన ధైర్యంతోనే ‘ది పారడైజ్’ కోసం బడ్జెట్‌ను ఏకంగా రూ. 200 కోట్లకు పెంచేశారు. దసరా కంటే రెట్టింపు స్థాయిలో ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.100 కోట్లకు జరిగినట్లు సమాచారం.
బడ్జెట్ అమాంతం పెరిగినప్పటికీ నిర్మాత సుధాకర్ చెరుకూరి మాత్రం వ్యాపార సమీకరణాలను అదుపులోనే ఉంచారు. భారీ రేట్లకు అమ్మితే డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోతారనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా డీల్స్ కుదుర్చుకున్నారని తెలుస్తుంది. వైజాగ్ ఏరియాకు సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు అడిగిన ధర కంటే తక్కువకే థియేట్రికల్ రైట్స్ కేటాయించడం విశేషం. ఈ నిజాన్ని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్వయంగా దిల్ రాజే బహిరంగంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాని మార్కెట్ ఇప్పటి వరకు సాధించని రూ.100 కోట్ల షేర్ (దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేస్తేనే ‘ది పారడైజ్’ బాక్సాఫీస్ వద్ద అధికారికంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ టార్గెట్‌ను నాని అందుకోగలడా అన్న అనుమానాలకు అడ్వాన్స్ బుకింగ్స్ గట్టి సమాధానమే ఇస్తున్నాయి. స్టార్ హీరోల రేంజ్‌లో ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటేశాయి. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ టికెట్ సేల్స్ సుమారు రూ. 40 కోట్లను టచ్ చేసినట్లు ట్రేడ్ సమాచారం. ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో యూనిట్ ముందే ప్రీమియర్స్ ప్రదర్శించింది. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా విరామం లేకుండా పాన్ ఇండియా ప్రమోషన్లు చేసిన నానికి కేవలం పాజిటివ్ టాక్ పడితే.. రూ. 100 కోట్ల షేర్ మార్కును దాటడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ హై-రిస్క్ గ్యాంబుల్‌లో నాని గెలిచి సరికొత్త రికార్డులను లిఖిస్తాడా లేదా అన్నది చూడాలి.

