Site icon NTV Telugu

ఎన్టీఆర్ జయంతి… నందమూరి కుటుంబం కీలక నిర్ణయం

Nandamuri Family Key Decision on NTR 98th Birth Anniversary

తెలుగు వారి ఆరాధ్య నటుడు, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. అయితే ప్రతి ఏడాది ఈ రోజున నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీయార్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించడం ఆనవాయితీ గా వస్తోంది. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి కరోనా మహమ్మారి దృష్ట్యా నాన్నగారి ఘాట్ వద్దకు వెళ్లలేకపోతున్నామని ఆయన తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ చెప్పారు. ‘‘ఈ రోజు నాన్నగారి 99వ జయంతి. ప్రతిసారీ ఆయన ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. అయితే ఈసారి కరోనా తీవ్రత వల్ల వెళ్లలేకపోతున్నాం. ఇది ఆయన అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా, ధైర్యంగా ఉండండి. ఇక నాన్నగారి గురించి రెండు మాటల్లో చెప్పాలంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని కాపాడిన తెలుగు ముద్దుబిడ్డ. నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు కానీ.. వారి రూపాల్లో మనందరినీ అలరించి మనకు దేవుడయ్యారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారు. యవత్ తెలుగు ఖ్యాతిని శిఖరాగ్రాన నిలిపారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారిదే. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన ఘనత ఆయనదే. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా ఆయనే. ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే. ఆ యుగపురుషుడిని అందరూ ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలని నందమూరి అభిమానులకు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తున్నా. జోహార్ ఎన్టీయార్, జై తెలుగు తల్లి, జోహార్ హరికృష్ణ’’ అని అన్నారు నందమూరి రామకృష్ణ .

Exit mobile version