పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. అయితే ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో రచ్చ మొదలైన విషయం తెలిసిందే. రాజకీయ రంగు పులుముకున్న ఈ కాంట్రవర్సీపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ దియోధర్… పవన్ కళ్యాణ్‌కు భయపడే వకీల్ సాబ్ సినిమా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదని, పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సినిమాలకు కూడా భయపడుతున్నారని ఆరోపించారు. దీంతో వకీల్‌సాబ్ సినిమాకు, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధం ఏంటని ప్రశ్నించిన మంత్రి పేర్ని నాని… సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉందని తేల్చి చెప్పారు. మీకు దురద ఉందని, మోజు ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు సునీల్ గారు అంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. నాగబాబు ఈ విషయంపై స్పందిస్తూ “మీకు ఏమయ్యింది నాని గారు… మీరు కరోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రాబిస్ వాక్సిన్ టు మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పెరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ” అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పవన్ సినిమాను ఏపీ ప్రభుత్వం ఇలా అడ్డుకోవడంపై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
నాని రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి : నాగబాబు
