Naga Chaitanya’s Vrushakarma Budget: ‘తండేల్’ సినిమాతో యువ సామ్రాట్ నాగ చైతన్య కెరీర్లో మరో కీలక విజయాన్ని అందుకున్నారు. వరుస ఫ్లాపులకు బ్రేక్ వేయడమే కాకుండా.. రూ.100 కోట్ల వసూళ్ల మార్కును అందుకున్న తొలి అక్కినేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విజయంతో జోష్ మీదున్న చైతూ.. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ సినిమా చై చేస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక కాగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.
నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వృషకర్మ రూపొందుతోంది. బడ్జెట్ ఇప్పటికే రూ.100 కోట్లు దాటినట్లు సమాచారం. కథకు అవసరమైన భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న నేపథ్యంలో వసూళ్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చై ముందు భారీ టార్గెట్టే ఉంది. వృషకర్మతో 200 నుంచి 300 కోట్లను దుల్లగొట్టాల్సి ఉంటుంది. ఇది టచ్ చేస్తే మైల్ స్టోన్ మూవీ 25వ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.
మరోవైపు దర్శకుడు కార్తీక్ వర్మ దండుకు ఆయన గురువు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే విషయంలో కీలక సూచనలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వృషకర్మపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విరూపాక్షతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ వర్మ.. ఈసారి నాగ చైతన్యతో ఎలాంటి కథను తెరపైకి తీసుకొస్తారన్న ఆసక్తి నెలకొంది. తండేల్ విజయాన్ని కొనసాగిస్తూ ‘వృషకర్మ’తో మరో భారీ హిట్ అందుకోవాలని నాగ చైతన్య భావిస్తున్నారు. భారీ బడ్జెట్, మైథలాజికల్ నేపథ్యం, విజువల్ ఎఫెక్ట్స్, సుకుమార్ భాగస్వామ్యం.. ఇలా పలు అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న వృషకర్మ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

