Site icon NTV Telugu

ప్రభాస్ – నాగ అశ్విన్ మూవీ మరింత వెనక్కి!?

PRabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ 21వ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తాము నిర్మించబోతున్నామని గత యేడాది ఫిబ్రవరి 26న ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రకటించారు. దీపిక పదుకునే నాయికగా నటించే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని అశ్వినీదత్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పటి నుండే సాగుతోంది. అయితే ఈ సినిమా నిర్మాణం, విడుదలకు మరికొంత సమయం పడుతుందని, ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు నాలుగు సినిమాల తర్వాతే ఇది జనం ముందుకు వస్తుందని తెలుస్తోంది.

నాగ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించిన తర్వాత ప్రభాస్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రూపొందిస్తున్న ‘ఆదిపురుష్‌’ ఒకటి కాగా, మరొకటి ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘సలార్’. నాగ అశ్విన్ సినిమా కంటే ఆలస్యంగా ప్రకటించబడిన ఈ రెండు సినిమాలూ ఇప్పటికే పట్టాలెక్కేసి, షూటింగ్ నూ జరుపుకుంటున్నాయి. నాగ అశ్విన్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉన్నారు. దాంతో ఈ రెండు సినిమాల తర్వాతే ఈ మూవీ వస్తుందని ప్రభాస్ అభిమానులు మానసికంగా ప్రిపేర్ అయిపోయారు. కానీ చిత్రంగా ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి. దానికి ఆధారం లేకపోలేదు. ప్రభాస్ – నాగ అశ్విన్ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్న డాని శాంచెజ్ లోపెజ్ ఇటీవల ఓ కెమెరా రెంటల్ ఆఫీస్ కు వెళ్ళి ఫోటో దిగారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ #Prabhas25 చిత్రం కోసం అన్నట్టుగా పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ తో నాగ అశ్విన్ తీయబోతున్న సినిమా 25వ ప్లేస్ లోకి వెళ్ళిపోయిందనే భావన చాలామందిలో కలుగుతోంది.

Read Also : “తగ్గేదే లే” అంటున్న ప్రియాంక… హాట్ పిక్స్

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ 20వ చిత్రం కాగా, ‘ఆదిపురుష్’ 21, ‘సలార్’ 22వ చిత్రం అవుతుంది. నాగ అశ్విన్ ది 25వ చిత్రం అయితే… ఈ మధ్యలో ప్రభాస్ మరో రెండు సినిమాలు చేసేయొచ్చన్నమాట. ఇటీవల ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఓ మూవీ చేయబోతున్నాడని, దానికి మైత్రీ మూవీ మేకర్స్ ఫైనాన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. సో… ఆ వార్తలోనూ కొంత నిజం లేకపోలేదనిపిస్తోంది. అలానే ప్రభాస్ మరో సినిమాకు కూడా కమిట్ అయి ఉంటాడని, అందుకే నాగ అశ్విన్ సినిమాను 25గా పేర్కొని ఉండొచ్చని కొందరంటున్నారు. మరి ఈ విషయంలో సీనియర్ అశ్వినిదత్ లేదా హీరో ప్రభాస్ వివరణ ఇస్తారేమో చూడాలి.

Exit mobile version