Site icon NTV Telugu

Muthayya: ఈటీవీ విన్ లో ‘ముత్తయ్య’

Muthayya

Muthayya

ముత్తయ్య త్వరలో ఈటీవీ విన్‌లో ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. సినిమాల్లో నటించాలనే కలతో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడి కథను ఈ చిత్రం హృదయస్పర్శిగా తెరపై ఆవిష్కరించింది. తన కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో అనేక అడ్డంకులను అధిగమించిన అతని ప్రయాణం అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ మౌర్య తెరకెక్కించారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దివాకర్ మణి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా, అలాగే సహ నిర్మాతగా కూడా పనిచేశారు.

బాలగం, బాపు వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ముత్తయ్య లండన్‌లోని యుకె ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది. 28వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ లాంగ్వేజెస్ విభాగంలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు, దుబాయ్‌లోని మెటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ తొలి దర్శకుడు అవార్డు, ఇండిక్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ (కెనడా), హ్యాబిటాట్ ఫిల్మ్ ఫెస్టివల్ (న్యూ ఢిల్లీ, ఇండియా), ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ అల్బెర్టా (కెనడా), థర్డ్ యాక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్ (కెనడా), సినిమాకింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బంగ్లాదేశ్), ఇస్చియా గ్లోబల్ ఫెస్టివల్ (ఇటలీ) వంటి ప్రతిష్టాత్మక వేదికలపై కూడా ప్రదర్శించబడింది.

ఈటీవీ విన్‌లో ఈ చిత్రం ప్రీమియర్ కాబోతున్న సందర్భంగా దర్శకుడు భాస్కర్ మౌర్య మాట్లాడుతూ, “ఈటీవీ విన్ ద్వారా ముత్తయ్యని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి సినిమా అయిన ఈ చిత్రం అనేక చలన చిత్రోత్సవాల్లో గొప్ప గుర్తింపు పొందడం, అనేక అవార్డులు సాధించడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను. కె. సుధాకర్ రెడ్డి మరియు కొత్త నటుడు అరుణ్ రాజ్ అద్భుతంగా నటించారు,” అని అన్నారు.

Exit mobile version