Movies Released Without Trailers in Tollywood: సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో ‘ట్రైలర్’కు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా సినిమా ప్రమోషన్ అంటే ముందుగా పోస్టర్, ఆ తర్వాత గ్లిమ్స్, టీజర్, స్పెషల్ వీడియోలు.. చివర్లో ట్రైలర్ ఇలా వరుసగా విడుదల చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో ట్రైలర్ రిలీజ్‌ను ఓ ప్రత్యేక ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్‌కు స్పెషల్ గెస్ట్స్ వస్తున్నారు. కుదరకుంటే.. సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చూపిస్తున్నారు మేకర్స్.
మహేశ్ బాబు ‘ఖలేజా’ ఒకటి:
సినిమాకు సంబంధించిన కథ, పాత్రలు, మేకింగ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు ట్రైలర్ కీలకంగా ఉండేది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ట్రైలర్‌ను విడుదల చేయకుండానే నేరుగా థియేటర్లలోకి వచ్చాయి. టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ ఇలా ట్రైలర్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ ఈ జాబితాలో ఒకటి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ట్రైలర్ లేకుండానే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించారు మేకర్స్. బాబు అభిమానుల్లో ఈ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.
లిస్ట్‌లో విజయ్-రష్మిక సినిమా:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ కూడా ట్రైలర్ లేకుండా థియేటర్లలోకి వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తర్వాత భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు విజయ్ కెరీర్‌లో కీలకమైన సినిమాగా మారింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉన్నప్పటికీ ట్రైలర్‌ను విడుదల చేయకుండానే చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. విడుదలైన తర్వాత ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను అందుకుంది.
డిస్కో రాజా, బ్రోచేవారెవరుర, కబాలి:
రవితేజ నటించిన థ్రిల్లర్ మూవీ ‘డిస్కో రాజా’ కూడా ట్రైలర్ లేకుండా విడుదలైన సినిమాల జాబితాలో ఉంది. సైన్స్ ఫిక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచే ఆసక్తి నెలకొంది. శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ ‘బ్రోచేవారెవరురా’ కూడా ట్రైలర్ లేకుండానే రిలీజ్ అయింది. విభిన్నమైన కథనం, కామెడీతో ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే రజనీకాంత్ క్రేజ్‌తో భారీ హైప్ సొంతం చేసుకుంది. ట్రైలర్ విషయంలో సాధారణ ప్రమోషనల్ పద్ధతులకు భిన్నంగా సాగిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది.
‘ది ప్యారడైజ్’ చేరబోతోందా?:
తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్కార్’ కూడా ట్రైలర్ లేకుండా థియేటర్లలోకి వచ్చింది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ కూడా చేరబోతోందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ట్రైలర్ విడుదలకు సంబంధించిన అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేస్తారా? లేక గతంలో కొన్ని సినిమాల తరహాలో ట్రైలర్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? అనేది చూడాలి. సినిమా ప్రమోషన్‌లో ట్రైలర్ ఒక కీలకమైన భాగంగా మారిపోయిన ఈ రోజుల్లో.. దానికి భిన్నంగా ట్రైలర్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ ఇదే తరహా ప్రమోషనల్ వ్యూహాన్ని అనుసరిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

