Site icon NTV Telugu

రెహ్మాన్, గుల్జార్ వినిపించిన భరతమాత సందేశం…. ‘మేరీ పుకార్ సునో’!

‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో ‘జయహో’ పాటకిగానూ రెహ్మాన్ తో పాటూ ఆస్కార్ అందుకున్నాడు బాలీవుడ్ లిరిసిస్ట్ గుల్జార్. ఆయన మరోసారి ‘ఏఆర్’తో చేతులు కలిపాడు. వారిద్దరూ సృష్టించిన అద్భుత గీతం ‘మేరీ పుకార్ సునో’ శుక్రవారం విడుదలైంది. తమ పాట, పుడమి తల్లి మనకు వినిపిస్తోన్న సందేశమని, రెహ్మాన్ అన్నాడు. కరోనా మహమ్మారి కకావికలం చేస్తోన్న ప్రస్తుత కాలంలో, భరతమాత తన బిడ్డల గొంతుక ద్వారా, అందరికీ ఆశని… నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసిందని… అదే ‘మేరీ పుకార్ సునో’ పాట అని… ఆస్కార్ విన్నర్ తెలిపాడు.
‘’తరిగిపోని సహజ వనరులు, చల్లటి గాలులు, నదీనదాలు, అనంతమైన సూర్య రశ్మి… ఇవన్నీ మనకు అందిస్తోన్న భూమాత తద్వారా ఆశని, విశ్వాసాన్ని కల్పిస్తోంది. కానీ, ఆమె తాను ఇచ్చిన గొప్ప బహుమతి లాంటి ప్రకృతిని మనల్ని చక్కగా చూసుకొమ్మని చెబుతోంది. హామీ ఇవ్వమంటోంది. ‘మేరీ పుకార్ సునో’ పాటలోని భావమంతా ఇదే!’’ అన్నారు గుల్జార్. ఆయన రాసిన పాటని రెహ్మాన్ స్వరపరచగా అల్కా యాజ్ఞిక్, శ్రేయా ఘోషల్, కేఎస్ చిత్రా, సాధన సర్గమ్, శాషా త్రిపాఠి, అర్మాన్ మలిక్, అసీస్ కౌర్ ఆలపించారు.
రెహ్మాన్, గుల్జార్ కాంబినేషన్ లో విడుదలైన ‘మేరీ పుకార్ సునో’ ఇంటర్నెట్ లో శ్రోతల మనసులు దోచుకుంటోంది…

Exit mobile version