Site icon NTV Telugu

MBU: ఇది కోర్టు ధిక్కరణ..యూనివర్సిటీ రద్దు ప్రచారంపై కీలక ప్రకటన

Mohanbabu University

Mohanbabu University

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సులపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు పేరుతో విడుదల చేసిన ప్రకటనలో, యూనివర్సిటీ ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రకటన ప్రకారం, APHERMC సిఫార్సులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉన్నాయి. ఈ అంశాన్ని పరిశీలించిన హైకోర్టు, APHERMC సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా ‘స్టే’ ఉత్తర్వును జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్తర్వును ధిక్కరించి APHERMC సదరు సిఫార్సులను పోర్టల్‌లో పెట్టడం దురదృష్టకరమని మంచు విష్ణు పేర్కొన్నారు.

Also Read : Aryan Khan-Sameer : ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌కి నోటిసులు ఇచ్చిన దిల్లీ హైకోర్టు

మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులు సరికాదని గట్టిగా విశ్వసిస్తున్నట్లు, గౌరవనీయ హైకోర్టు న్యాయం చేకూరుస్తుందని విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని తల్లిదండ్రులకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా నిలుస్తోందని, రాయలసీమను ఉన్నత విద్యకు గుర్తింపు పొందిన కేంద్రంగా మారుస్తోందని ప్రకటనలో తెలిపారు. గత కొన్నేళ్లుగా, MBU ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు అత్యధిక ప్లేస్‌మెంట్లు మరియు వేతన ప్యాకేజీలను స్థిరంగా అందిస్తోందని, ఇది దేశంలోని అనేక ప్రభుత్వ లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సాధ్యపడని రికార్డు అని పేర్కొన్నారు.

Also Read : Guntur Murder: పొట్టిగా ఉన్నాడని బావని పొడిచి చంపిన బావమరిది..

1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి, ఈ విశ్వవిద్యాలయం బలమైన సామాజిక నిబద్ధతను కొనసాగిస్తోంది. ఉచిత విద్య, సాయుధ దళాలు/పోలీసు సిబ్బంది పిల్లలకు పూర్తి స్కాలర్‌షిప్పులు, అనాథలకు పూర్తి విద్య మరియు సంరక్షణ అందించడం వంటి సామాజిక సేవలను కొనసాగిస్తోంది అని పేర్కొన్నారు. మా గౌరవనీయ ఛాన్సలర్ డాక్టర్ ఎం. మోహన్ బాబు గారి మార్గదర్శకత్వంలో ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తివంతం చేసే ప్రయత్నాన్ని కొనిసాగిస్తున్నామని మంచు విష్ణు ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.

Exit mobile version