జాతీయ అవార్డు గ్రహీత గుల్జార్, గ్రామీ అండ్ అకాడమీ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ కాంబినేషన్ లో విడుదలైంది యాంథమ్ ఆఫ్ హోప్ ‘మేరీ పుకార్ సునో’. సోనీ మ్యూజిక్ ఇండియా సంస్థ విడుదల చేసిన ఈ సింగిల్ ఆల్బమ్ లోని గీతాన్ని అల్కా యాజ్ఞిక్, శ్రియో ఘోషల్, కె.ఎస్. చిత్ర, సాధన సర్గమ్ తో పాటు అర్మాన్ మల్లిక్, సషా తృప్తి, ఆసీస్ కౌర్ గానం చేశారు. జూన్ 25న ఈ గీతం ఇలా విడుదలైందో లేదో అలా… ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరించింది. ఇద్దరు మ్యూజిక్ మాస్ట్రోస్ కలయికలో వచ్చిన ఈ గీతానికి ఏడుగురు గాయనీ గాయకులు గాత్రాన్ని అందించడం నిజంగా గొప్ప విషయం. ఇటు తూర్పు నుండి అటు పశ్చిమం వరకూ ఈ పాటకు కోట్లాది మంది అభిమానులు ఏర్పడిపోయారు.
విశేషం ఏమంటే… ఈ పాటకు సంబంధించిన బిల్ బోర్డ్స్ ఇప్పుడు న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ లోనూ దర్శనం ఇస్తున్నాయి. అనేక దేశాలలో ట్రెండింగ్ అవుతున్న ఈ పాట శ్రోతలకు సరికొత్త ఆశలను కలిగించడంలో భాగస్వామిగా మారిపోయింది. చీకటి తర్వాత వెలుగు వస్తుందనే సందేశంతో కూడిన ఈ గీతం కష్టకాలం ఎంతో కాలం ఉండదనే నగ్న సత్యాన్ని కూడా తెలిపిందని పలువురు అంటున్నారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు ఈ గీతం ద్వారా గుల్జార్, రెహమాన్ మంచి భరోసా ఇచ్చారనే చెప్పాలి.
